పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

25

వచ్చును. ఏమీ! స్వయంవరణభాగ్యమా! అట్టి మహాభాగ్యము హిందూదేశములోని బ్రాహ్మణులకు స్వప్నావస్థయందును లేదు. ఒకవేళ ముం దెన్న డైనఁ గలుగవచ్చు నేమోకాని యిప్పటికి లేదు. మాలోని విద్యావిభూషితులగు మహానుభావులు వివేకదీపమువంక నైనఁ జూడ నొల్లక కన్నులు మూసికొని పూర్వచారమహాభూతమునకే సేవ చేయుచు వచ్చు చున్నంతవఱకు మనదేశమున కట్టిపుణ్యము ముందును గలుగదు. పండితపామరభేదము లేక మావా రెల్లరును నాచారమునకు దాసులు. ఆచారపిశాచ మావేశించినచో వారికి దయయు ధర్మమును సత్యమును సత్కర్మమును సర్వమును పరిత్యాజ్యములు. పూర్వు లాదియందు బాల్యవివాహ మన్న పేరే యెఱిఁగియుండరు. వేదములయం దతి బాల్యవివాహమన్న మాటయే మృగ్యము. ఆస్వాభావికమైన యీ యతిబాల్య వివాహపీడ యాచారపిశాచావేశబలముచేత వచ్చినదేకాని విధివిహితమయినది కాదు. మావారు వివాహనిశ్చయము చేయునప్పటికిఁ బండ్రెండేండ్లవాఁడనైన నాకు వివాహోద్దేశ మేతిన్నఁగాదెలియదు. నాకంటెను నాలుగేండ్లు చిన్నదయిన నాభార్యకు మొదలే తెలిసియుండదని వేఱుగఁ జెప్పవలయునా ? నాకుఁ బదుమూఁడవయేటను నాసహధర్మచారిణికిఁ దొమ్మిదవయేటను బొమ్మల పెండ్లివలె మావివాహమహోత్సవము నడచినది. పిండివంటలు తినుటయు వాద్యములు వినుటయు వేశ్యలనృత్యమును గనుటయు మాకప్పు డాహ్లాదకరములు గానే యుండియుండును. సర్వానర్థమూలకమయిన బాల్యవివాహమువలన మాకుమాత్ర మనర్థము లంతగాఁ గలుగక యీశ్వరానుగ్రహమువలన మాదాంపత్యము సంతోషదాయకమే యయినది. వివాహ మయిన సంవత్సరము లోపలనే నాభార్యకు స్ఫోటకము వచ్చెనుగాని యాచెడురోగమువలన నంగవైకల్యముగాని తిరుగంటి కులి యాడించినట్లు మొగమునిండ గుంటలు పడుటగాని కలుగలేదు; వివాహమయిన రెండుసంవత్సరములకే నాకును బ్రాణము పోవలసినంతవ్యాధి వచ్చెనుగాని ప్రాణాపాయము కలుగలేదు. మాయిరువురకు నిట్టియాపదలు తప్పుట భగవత్కటాక్షమువలనఁగాని బాల్య