పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

స్వీయ చరిత్రము.

యచిరతపోమహిమాఢ్యులు కాఁ గోరి, ప్రయాణ మెప్పు డెప్పు డని కాల విలంబాసహిష్ణులయి నన్నేత్వరపెట్ట మొదలుపెట్టిరి. దేహదౌర్బల్యమునుబట్టి దూరదేశయాత్రకు సాహసము చేయలేక హృదయ మిట్టట్టు లూఁగ నే నిదిగో నదిగో యని జాగు చేయసాగితిని. ఒకనాఁటి సాయంకాలము వారిలో నిరువురు నాయొద్దకు వచ్చి రేపే ప్రయాణమని చెప్పిరి. నేను వారివెంట రాఁజాలనంటిని. అంతట వారు నాతో మరల మాటాడక, యింటివద్దఁ బాఠశాలకుఁ బోయెదమని చెప్పి భోజనములు చేసి పుస్తకములు పట్టుకొని పాఠాశాలదారినే తపోగమన ప్రాతంభులయి యుత్తరాభిముఖముగా వెడలిరి. సాయంకాలము వేళకు వారిండ్లకు రాకపోఁగా బంధువులు వెదక నారంభించి మూడవయతనిని పిఠాపురమువద్దనే పట్టుకొని యింటికిఁ గొనివచ్చిరి. విజయనగరము వఱకును బోయినతరువాత రెండవయతఁడు మొదటియాతనితోఁ దగవులాడి మురుగులమ్ముకొని వెనుకమరలెను. మొదటియతఁడు కొంతదృఢ మనస్కుఁడయి ముందుకుసాగి దారిబత్తెమునకయి వెండిమొలత్రాడమ్ముకొని జగగ్నాథమువఱకును బోయి యాత్రచేసికొని పోయినదారినే మరలివచ్చెను. ఈ ప్రకారముగా నామానసికయాత్రతోను మిత్రులదేహయాత్రతోను మాతపోయాత్రావ్రత ముద్యాపన మయినది. అంతటితో నాకుఁ దపశ్శక్తియందలి విశ్వాసము చెడలేదుగాని తపోవనగమనోత్సాహము మాత్రము భగ్న మయినది.

నాకావఱకే వివాహమునకుఁ గన్యనిచ్చెదమని వచ్చి పలువురు గృహస్థులు తిరిగిపోవ నారంభించిరి. అనేకకన్యలను జూచి తుదకు నాతల్లియు పెదతండ్రిగారును గలిసి యాలోచించి మాపట్టణమునకు రెండు మైళ్ళదూరములో నున్న కాతే రను గ్రామమునందున్న యద్దంకివారి పడుచును నాకు వివాహము చేయుటకయి యేర్పాటుచేసిరి. వరుఁడు వధువును వధువు వరునిఁ జూచి తమయిష్టము వచ్చినవారి నేర్పఱుచుకొనక తమయావజ్జీవసుఖదుఃఖములతో సంబంధించిన పెండ్లియేర్పాటును పూర్ణముగా నితరుల కేల విడ వ వలయునని హిందూదేశ బ్రాహ్మణాచారప్రభావ మెఱుఃగనివారికి సందేహము తోఁచ