పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

297



నిలువయుంచితిని. ఈకట్నములలోని బట్ట యొకటియైనను నేనుమాత్రము పుచ్చుకొనలేదు. ఈతనిని ప్రేరేచిన పెద్దమనుష్యుల పేరు లిచ్చట పేర్కొనుట యనావశ్యకము. నాకు రెండువిధములుగా శత్రువులనేకులేర్పడి నాకు కీడు వేఁడుచుండెడువారు. అందొక తెగవారు వితంతు వివాహ ప్రతిపక్షులుగానుండి నన్ను ద్వేషించువారు; ఇంకొకతెగవారు వివేకవర్థనిలో నేను తమయకార్యములను బయలఁబెట్టుచు వచ్చుటచేత నంతస్తాపమునొంది వ్రేటుపడ్డ పాములవలె పగతీర్చుకొనుటకు సమయము ప్రతీక్షించుచుండెడివారు. ఈకడపటి తెగవారు మాసామాజికులలో సహిత మొకరిద్దరుండిరి. వీరి చర్యలను సూచించుచు నాస్త్రీపునర్వివాహభూతవర్తమానస్థితులను గూర్చిన యుపన్యాసములలో నిట్లు వ్రాసితిని.

"ఉన్న యైకమత్యమును చెడఁగొట్టుట యెట్టివారికిని సులభముకాని చెడినదానిని మరల కూర్చుట సాధారణముగా సాధ్యముకాదు. అట్లు నాటఁబడిన వైరవిషబీజము మెల్ల మెల్లఁగా నంకురించి వివాహముచేసికొన్న వారికే కాక సామాజికులలో నొకరిద్దఱికిఁగూడ తన విషవాయువును బఱపి యీ మహాకార్యమునకు భంగకరమయిన దుష్ఫలములను కొంతవఱకుఁ గలుఁగజేసి నందునకయి యెంతయు చింతిల్లుచున్నాను. ఒక సత్కార్యమునకు విఘ్నము కలుగఁజేసెడి యవకాశము కొంచెము లభింపఁగానే దానిని సందుచేసికొని గోరంతలు కొండంతలుచేసి ద్వేషాగ్నిని ప్రజ్వలింపఁజేసి కార్యవిఘాతమయి నప్పుడుచూచి సంతోషింపవలెనని కనిపెట్టుకొనియుండు మహానుభావులు లోకములో ననేకులుందురు. అట్టివారి దుర్బోధలు విని చెడిపోక బీటలు వాఱుచున్న యైకమత్య దుర్గమును స్వలాభముకొఱ కెల్లవారును శాంతిసుధతో నతికింపఁ జూతురని నమ్ముచున్నాను. యుక్తకాలములో నట్లుచేయక పోయినయెడల కార్యము మించినతరువాత పశ్చాత్తాపపడిన ప్రయోజనము లేక స్వయంకృతదోషఫలము ననుభవింపవలసివచ్చును."