పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

స్వీయ చరిత్రము.



వివాహములయినవారిలో విద్యాధికులుకాని వారు తమకు కష్టములు కలుగుచున్నవని యితరులతో నంతగా చెప్పుకొనుచుండక పోయినను విద్యాధికులలో కొందరు తమకు కలిగిన యల్పకష్టములను కోటిగుణితముగా చాటుకొనుచు వీరివారియొద్దకు పోయి సదా మొఱ్ఱపెట్టుకొనుచుండెడివారు. వారు పడ్డ కష్టములు వారు ఘోషించుకొనుచుండినంత విశేషమైనవి కావని నేను చెప్పఁగలను. వారికేవిధమయిన కష్టములును కలుగకుండఁజేయుటకయి నేనును నామిత్రులును మా చేతనైనదంతయుఁ జేయుచుంటిమి. ఈవివాహములు చేసికొన్న వారిలో నావఱకెవ్వరికిని సొంతయిండ్లులేవు. అట్టివారికందఱికిని కాపురముండుట కిండ్లీయఁబడినవి; అందుచేత మాయిండ్లలోనుండి లేచి పొండని వీరికి తొందర యిచ్చువా రెవ్వరునులేరు; పనిచేయుటకయి సేవకులియ్యఁ బడిరి: వారు ప్రతిదినమును మంచినీళ్లిచ్చు చుండుటయేకాక కావలసినప్పుడు వంటసహితముచేసి పెట్టుచుండిరి. భోజన వ్యయములుమాత్రమే కాక చదువుకొనువారికి పాఠశాలల జీతములును పుస్తకములును బట్టలును వేఱుగా నీయఁబడుచువచ్చినవి; వ్యాధులు వచ్చినప్పుడు వైద్యపుకర్చులను, శుభాశుభకార్యవ్యయములను, సమాజమువారే భరించుచుండిరి. ఎవ్వరికైనఁ గొంచెము కష్టము వచ్చిన పక్షమున నేనును గవర్రాజుగారును బోయి విచారించుచు కావలసిన సాయమునంతయు జేయుచుంటిమి. అప్పుడు మాతో మాటాడనివారొక రిద్దఱుండినను వారికి కష్టము వచ్చినప్పుడు సహితము మేముపోయి తోడుపడకుండలేదు. ఆకాలమునందు పులవర్తి శేషయ్యగారు మాయింటికిరాక నాతో నంతగా మాటాడకుండిరి. నేనొకదినమున పనిమీఁద నెక్కడికోపోయి పగలు పదునొకండు గంటలకు భోజనము నిమిత్తము నడిచి యింటికిఁ బోవుచుంటిని. బజాఱులో నన్ను దూరమునుండిచూచి యతఁడు తానెక్కివచ్చుచుండిన బండిలోనుండి దిగివచ్చి నాపాదములఁబడి యేడువఁజొచ్చెను. నేనతనిని లేవఁదీసి యేల యేడ్చెదవని యడుగఁగా కొంచెముకాలము క్రిందట ప్రసవమయిన తనభార్యకు సూతిక కనఁబడి జబ్బుగా