పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

277



ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు కాకినాడలో రామకృష్ణయ్యగారిని చూచుట తటస్థించెను. లక్ష్మీనరసింహముగారితో మాటాడితినన్న విషయము నాతో నావఱకు పదివేల రూపాయలనిచ్చుటను గూర్చి మాటాడిన విషయమే ఈవిషయమయి మఱునాఁడాయన మరణశాసనమే వ్రాసియిచ్చెను. ఈవిషయమునుగూర్చి 1887 వ సంవత్సరారంభమున నేను సమాజసావంత్సరికసభ యందు "స్త్రీ పునర్వివాహ వ్యాపారముయొక్క భూతవర్తమానస్థితు" లను గుఱించి వ్రాసిచదివిదానిలో నిట్లు చెప్పితిని. -

"అటుపిమ్మట రామకృష్ణయ్యగారిక్కడకు వచ్చినప్పుడు తాము తరువాత నిచ్చిన పదివేల రూపాయలును మొదటి రెండు వివాహములకు ప్రత్యేకముగా చేసిన వ్యయములను కట్టించిన యిండ్లును స్త్రీ పునర్వివాహాభివృద్ధి నిమిత్తమయిచేసిన యితర వ్యయములును కలుపుకొని యిరువదివేల రూపాయ లయ్యెననియు, మొట్ట మొదట వాగ్దానముచేసిన మొత్తములో అవిపోఁగా మిగిలిన పదివేల రూపాయలును వేగిరమిచ్చెదననియుఁ జెప్పి మూలధనము వ్యయపడక వృద్ధివలన సమాజమునకు తోడుపడునట్లుగాఁ జేయుటకై యేమి చేయుట యుచితముగా నుండునని నన్నాలోచన యడిగిరి. అప్పుడు నేనొక సారి నాగోజీరావు పంతులవారియొద్దకును, ఇంకొకసారి ఆచంట లింగరాజు గారియొద్దకును వారితోఁగలిసిపోయి యాలోచించితిమిగాని యప్పుడెట్లుచేయుటకును నిశ్చయింపలేదు. దేశముయొక్క యభాగ్యముచేత నింతలో వారి కవసానదశ సంప్రాప్తమయినందున, ఉద్దేశించిన పదివేల రూపాయలును మరణ శాసనమూలమున నిచ్చి, చేసిన వాగ్దానమును చెల్లించుకొన్నారు."

రామకృష్ణయ్యగారు వ్రాసినయుత్తరము నాకందిన రెండుమూడు దినములలోనే యాయన కాలధర్మమునొందుట తటస్థించినది. వారు నాకువ్రాసిన యుత్తరములలో నిదియే కడపటిది. ఈ యుత్తరమునం దుదాహరింపఁబడిన రావి గురువావాధానులకథ నిచ్చట కొంత తెలుపవలసియున్నది. ఆకాలము నందు వితంతు కన్యలను తెచ్చెదమనియు, దారిబత్తెములకుఁ గావలయుననియు