పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

స్వీయ చరిత్రము.

(కడచిన 15 దినములనుండి మెడమీఁద కురుపుచేత నేను బాధపడుచున్నాను. నేను మన ఏ. ఎల్. నరసింహముగారిని చూచి సమస్తమును ఆయనతో మాటాడినాను. దయచేసి ఆయనను చూడుఁడు. రావి గురువావధాని సొమ్ము పోఁగొట్టకుఁడు. అతనివద్దనుండి నాకుత్తరమువచ్చినది. ఈయుత్తర ప్రత్యుత్తరములు అమలాపురములో ప్లీడరైన పేరి విస్సయ్యగారిద్వారమున జరగినవి - దానిలోని సంగతులు వ్రాసియిచ్చిన పత్రపుసొమ్ము చెల్లించుటకు గడువిమ్మని ప్రార్థన. పత్రమునకు నకలు వ్రాయించి నాకుపంపుఁడు, లేదా వ్యాజ్యము వేయుటకు పేరి విస్సయ్యగారికి పంపుఁడు - ఇక్కడినుండి తెలుఁగు.)

యీవ్యవహారం విషయమయి విస్సయ్యగారు గురువావాధానులు గారిని పిలిపించి కూకలువేశినంద్ను గురువావాధానులుగారు నావద్దకువచ్చి కొంచం వాయిదా యివ్వవలశ్నిది రూపాయలు యిస్తాననికోరి యీహంశములే గురువావాధానులుగారు ఉత్తరంవ్రాశి నాకు యిచ్చినారు. అది కావలశియుంటే మీకుపంపుతాను. దస్తావేజుకు కాపీ తయారుచేయించి విస్సయ్యగారివద్దకు పంపి కంప్లయింటు చేయవలెను.

గవర్రాజుగారు నాకు రు. 100 లు నూరురూపాయలు యివ్వవలశియున్నది. ఆరూపాయలు ఆయనకు వీలు అయినప్పుడు W. M. Association కు యిమ్మని చెప్పకోరుతాను. సుబ్బారావు పంతులు గార్కీ గవర్రాజు గారికీ నా Compliments చెప్పకోరుతాను. ఆయనకు తొందరయిచ్చి పుచ్చుకో వద్దు. యెప్పుడు యిష్టంవచ్చియిస్తే అప్పుడు పుచ్చుకొండి.

Yours truly

P. Ramakistiah."

ఈ యుత్తరము వచ్చువఱకును రామకృష్ణయ్యగారికి కురుపు వేసినట్టే నాకు తెలియదు. రావి గురువావాధానుల పత్రముయొక్క నకలు వ్యాజ్యము వేయించు నిమిత్తము తనకు పంపవలసినదని కోరుటచేత, ఈయుత్తరమందిన తరువాత సహితము కురుపపాయకరమైనదని నేను భావింపలేదు. తమ బంధువులను చూచుటకయి యానాము వెళ్లితిరిగి వచ్చునప్పుడు మూడుదినములుండి,