పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

స్వీయ చరిత్రము.



చెప్పి, యనేకులు నావద్ద రెండును మూఁడును రూపాయలుపుచ్చుకొనీ మోసము చేయుచుండెడివారు. ఈరావి గురువావాధనులు నాయొద్దకువచ్చి, అమలాపురము తాలూకాలోని యొకగ్రామములో అక్క చెల్లెండ్రిద్దఱు బాల వితంతువులుగలరనియు నూఱు రూపాయలు బదులిచ్చినపక్షమున వారితండ్రి ఋణవిముక్తుఁడయి యాపిల్లలను తనవెంట నాయొద్దకుఁబంపుననియు నమ్మకము పుట్ట చెప్పెను. అప్పుడు నేను కోరిన నూఱు రూపాయలను నాలవవివాహము చేసికొన్న పులవర్తి శేషయ్యగారిచేతి కిచ్చి, ఈయనవెంట కోనసీమలోని యా గ్రామమునకువెళ్ళి యీనూఱు రూపాయలును తండ్రి పిల్లలను తీసికొని వచ్చి యొప్పగించిన తరువాతనిచ్చి యీ బ్రాహ్మణుని తోడఁగూడ నిరువురు బాలవితంతువులను తీసికొని రావలసినదని చెప్పి పంపితిని. గురువావాధానులు శేషయ్యగారిని చెప్పిన గ్రామమునకుఁ గొనిపోయి చెఱువుగట్టుమీఁద కూరుచుండఁబెట్టి, మీరు గ్రామములోనికి వచ్చినజను లనుమాన పడుదురనియు, అందువలన కార్యవిఘాతము కలుగుననియు, రూపాయలు తనచేతి కిచ్చిన పక్షమున తండ్రికిచ్చి యరగంటలోపల పిల్లలతోవచ్చి కలిసికొనెదననియు, చెప్పి నమ్మించి తొంబదిరూపాయలు పుచ్చుకొని గ్రామమువంకనడిచి యదృశ్యుఁడయ్యెను. నామిత్రుఁ డాచెఱువుగట్టుమీఁద గంటలకొలఁది వేచియుండి యాతని రాకకానక, గ్రామములోనికిపోయి విచారించి యచ్చట సహిత మతనిజాడ తెలియక, నిరాశచేసికొని యొక్కఁడును మరలి నాయొద్దకువచ్చెను. తరువాత గురువావాధానులను పిలిపించి బెదరించి యామొత్తమున కాతనివలన పత్రము వ్రాయించి పుచ్చుకొంటిమికాని యతఁడు సొత్తేమియులేని నిర్ధనుఁడగుటవలన రామకృష్ణయ్యగారువ్రాసినట్టు వ్యాజ్యమునకు సొమ్ముదండుగ పెట్టక యసలుసొమ్మును వదలుకొని యూరకుంటిమి. ఒక్క యీగురువావధానులు మాత్రమే కాక యితరులుకూడ మమ్ము మోసముచేసినవారును మోసముచేయఁ బ్రయత్నించినవారును పలువురుండిరి. "విశాఘపట్టణమునుండి యొక బ్రాహ్మణుఁడు వితంతుకన్యలను తీసికొని వచ్చెదననిచెప్పి మునిస్వామిని విశాఘప