పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము.

17

రాజకీయోద్యోగమునకుఁ గావలసిన పనిని నేర్చుకొనుటకయి తాలూకా కచేరీలో గుమాస్తాగా నున్న మాబంధువులగు పోతరాజు రఘురామయ్యగారి యొద్ద నన్నొప్పగించిరి. నేను ప్రతిదినమును మధ్యాహ్నమున మావీధి చివరనే యున్న తాలూకా కచేరికిఁ బోయి యాయన చెప్పినపని చేయుచుంటిని. ఈ ప్రకారముగా సంవత్సరమో రెండుసంవత్సరములో వ్యర్థము లయినవి. ఈకాలములో దూరి సోమయాజులుగారు ప్రాతఃకాలమునందు మాయింటికి వచ్చి నాకు రఘువంశమును జెప్పుచుండిరి; సాయంకాలమునందు మాపెద తండ్రిగారే నాకింగ్లీషక్షరములను, గుణితమును, మాటలను నేర్పుచుండిరి. ఆకాలమునందుఁ బరీక్షలు లేనందున, దొరతనమువారికొలువు నపేక్షించు వారు రాజకీయకార్యస్థానములకుఁ బోయి పని నేర్చుకొనుచు నధికారుల ననుసరించి తిరుగుచుండెడువారు. ఇంతలోహిందూదేశ రాజ్యనిర్వహణభారమును తూర్పిండియా సంఘమువారినుండి తప్పించి శ్రీమహారాజ్ఞిగారే స్వయముగా వహించినతరువాత దేశభాషలలోను నింగ్లీషుభాషలోను సామాన్య పరీక్షలును విశేషపరీక్షలును గొన్ని యేర్పఱుపఁబడినవి. అటుతరువాత నల్ప కాలములో నే 1860 వ సంవత్సరమున మావారు నన్ను దొరతనమువారి మండల పాఠశాల కింగ్లీషునేర్చుకొనుటకయి పంపిరి.

నే నింగ్లీషుపాఠశాలలోఁ బ్రవేశించునప్పటి కయినను దేహము దృఢపడి కండపుష్టిఁగలవాఁడనై యుండక పెద్దగాలివేసిన నెగిరిపోవునట్లు సన్నముగా పూచికిపుడకవలె నుండెడివాఁడను. ఇట్లుండుటకుఁ గొంతవఱకు మావారికి నాపయిఁ గల యతిప్రేమయే కారణమని చెప్పవచ్చును. అతిదయచేతనే నాతల్లియుఁ బెదతండ్రియు నాకన్నమును చిఱుతిండియు నధికముగాఁ బెట్టి నాజీర్ణాశయమును గొంతవఱకు దుర్బలపఱిచినారు; అతిదయచేతనే నాపితామహియు ప్రపితామహియు నన్ను గడప దాఁటనీయక చదువు విషయమున నాతల్లి యొకతిట్టు తిట్టినను నా పెదతండ్రి యొక దెబ్బకొట్టినను జగడమాడి యెత్తుకొని మోచి నాశరీరమును దుర్బలపఱిచినారు. అందుచేత