పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

స్వీయ చరిత్రము.

నాకప్పు డజీర్ణ వ్యాధిచిహ్నములు పొడచూపుటయేకాక పీనసరోగ మొకటి క్రొత్తగా న న్నాశ్రయించినది. పడిసెముచేత దినమునకు వేయితుమ్ములు తుమ్ముచుండెడివాఁడను. ఈపీనసపిశాచి ప్రియతముఁడనైన నన్నీ వార్ధకదశ యందును విడిచి పోఁజాలకున్నది. మొత్తముమీఁద మావారందఱును స్వభావ దుర్బలమగు నాశరీర మెండ సోఁకినఁ గందిపోవు ననియు, ఆటలాడిన నలసి పోవుననియు, పనిచేసిన బడలిచిక్కి పోవుననియుఁ దలఁచి, దేహపరిశ్రమమున కవకాశమియ్యక యాటలకయినను విడువక సదా యిల్లు కదలనీయక యేదో వ్రాయుమనియో చదువుమనియో పనిచెప్పి యొకచోట నన్నుఁ గూరుచుండఁ బెట్టుచు వచ్చిరి. నిర్బంధించి చేయించుపనియం దెప్పుడును శ్రద్ధానురాగము లుండవు గనుకను, విరామము లేక సదా యొక్కపనినే చేయుచుండుట విసుఁగును బుట్టించును గనుకను, నాకు నియమింపఁబడిన పనియందు నేను శ్రద్ధాళువును గాక యుపేక్షాపరుఁడనై యుత్సాహశూన్యుఁడనై సర్వదా పని చేయుచున్నట్లే నటించుచు నెట్లో ముగించెడివాఁడను. చదువ నియమించిన పాఠము రెండుమూఁడుసారులు చదువునప్పటికే వచ్చినను, వ్రాయ నియమించినకాగితములు గంటలోనే ముగింపఁ గలిగినను, దినమంతయు చదువు చున్నట్టును వ్రాయుచున్నట్టును నటించుచు, చేతిలో పుస్తకమునో తొడమీద కాగితములనో పెట్టుకొనిమాటల కారంభించెడివాఁడను. నాతో మాటాడువా రెవ్వ రందు రేమో వినుఁడు. యథేచ్ఛముగా మాటాడుకొనుటకు బాలురకు బాలురేకావలసియుందురుకదా? మాయింట నితరబాలురులేరు. అందుచేతఁ బ్రధమ బాల్యావస్థలో నున్న నేను వార్ధక్య మనెడు ద్వితీయబాల్యావస్థలో నున్న నా ప్రపితామహి పరుండుగదిగుమ్మమువద్దఁ జేరి మెల్లఁగా నామెతో నేవో మాటలు వేయుచుండెడివాఁడను. కాలువిఱిఁగి సదా మంచముమీఁదనే పరుండి యుండెడి యామెయు కాలము జరగక నాతో నేదో పుక్కిటి పురాణము సేసి ప్రొద్దు పుచ్చుకొను చుండెడిది. ఈప్రసంగమధ్యమున మాయమ్మ యక్కడకు వచ్చి మేము కథలు చెప్పుకొనుచుండగా జూచిన