పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

స్వీయ చరిత్రము.

దురభ్యాసము పట్టుపడియుండును. ముక్కుతో మాటాడుట మానివేయవలసినదని తరువాత నా పెదతండ్రిగా రనేకపర్యాయములు నాముక్కు నలుపుచు వచ్చుట నాకెప్పటికిని మఱపునకు రాదు. చిన్న నాఁటి యాముక్కు మాటలు నాకు మఱికొన్ని సంవత్సరములకుఁగాని పూర్ణముగాఁ బోలేదు. ఏ దురభ్యాస మయినను మొదట వచ్చుట సులభముగాని తరువాతఁ బోవుట యంత సులభము కాదు. ఆలోచన లేని బాల్యదశయందు దురభ్యాసము లవలీలగా నలవడును. కాఁబట్టి బాలురు తామేదురభ్యాసములను జేసికొనక మిగుల జాగరూకులయి యుండవలెను. ఆరంభదశలో నత్యల్పమయిన దనుకొన్న దురభ్యాసమే కాలక్రమమున బలపడి కొంతకాలమునకు స్వభావమయి కడపట మార్చుకొనుట కెంతోకష్టసాధ్య మగును. బాలుర తోడివా రేమి చేయుదురో దానిని దామును జేయఁ జూతురు. పొడుమును పొగచుట్టయు నలవాటగుట యీవిధముగానే. ఈయనబడిలో నే నక్షరములును, గుణితమును, ఎక్కములును నేర్చుకొని పుస్తకము పట్టియుందును. అల్పకాలములోనే యీయయ్యవా రిహలోకయాత్రను విడిచినందున, తదనంతరము మా యింటికిసమీపమున తిరుమెళ్లవారిలోపల నున్న సోమరాజుగారి బడికి మా వారు నన్నుఁ బంపిరి. గూనివాఁ డగుటచేత నీయనను గూని సోమరాజుగారని సాధారణముగాఁ బిలిచెడివారు. ఈయన మొదటిపంతులవలెఁ గాక తెలుఁగు నందుఁ గొంత పాండిత్యము గలవాఁడయి పిల్లలచేత పెద్దపుస్తకము (పురాణము) నుగూడఁ జదివించి యర్థము చెప్పుచు వచ్చెను. నాచేతఁ బ్రథమమున నర్థసహితముగా బాలరామాయణమును నమరనిఘంటువును చదివించిరిగాని యాసంస్కృతగ్రంథపఠనమువలన నా కప్పు డంతగా లాభము కలుగ లేదు. అటుతరువాత వాచకమును వ్రాఁతయుఁ గాక రుక్మిణీకల్యాణమును, సుమతి శతకమును, కృష్ణశతకమును, ఆంధ్రనామసంగ్రహమును, నాచేత రోఁకటి పాటగా వల్లెవేయించిరి. నేను వీధిబడులలో నేర్చుకొన్న దంతయు నింతే. ఇంతటితోఁ దెలుఁగుచదువు పూర్తియైనదని మావారు నన్ను బడి మానిపించి