పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వీయ చరిత్రము.

15

మాతల్లులు తమయిరువురి నడుమను నన్నుఁ బరుండఁబెట్టుకొనిరి. ఇట్లు కొంత దూరము ప్రయాణము సాగినతరువాత మార్గమధ్యమునం దొకకాలువ దాఁట వలసి వచ్చెను. అప్పు డాకాలువలో ఱొమ్ములలోఁతు నీరు బాఱుచుండెను. లోపలివారికి నీరు సోఁకకుండునట్లుగా బోయలు పల్లకిని చేతులపై నెత్తుకొని నీటిలో దిగి నడచుచుండిరి. ఆసమయమునం దెట్లో నేను నాతల్లిపైనుండి దాఁటి కాలువలోఁబడి ప్రవాహవేగమునఁ గొట్టుకొనిపోవుచుంటిని. పల్లకిలో నున్నవారు నేను నీటిలోఁ బడుట కనిపెట్టనే లేదు. పల్లకిని మోయుచున్న బోయవాఁ డొకఁడు చూచి పల్లకిని విడిచి పరుగెత్తి, యొక్కమునుక వేసి కొంచెము నీరు త్రాగియున్న నన్నుఁ బట్టుకొని పైకిఁదీసి పల్లకిలోని నా తల్లులకొప్పగించెను. మృత్యుముఖమునఁ బడి వెలువడినది యీ జలగండముతో నిది మూఁడవసారి. ఇట్లిన్ని సారులు పరమేశ్వరుఁడు తననిర్హేతుకజాయమాన కటాక్షముచేత నన్న కాలమృత్యువునుండి రక్షింప ననుగ్రహించుటను నేను బొత్తిగా వ్యర్థము చేయలేదని దీనిం జదువువారు భావింపఁగలిగెడుపక్షమున నన్ను నేను ధన్యతమునిగాఁ బరిగణించుకొనెదను.

కొంతకాలము నా పెదతండ్రిగారగు వేంకటరత్నముగారు రాజమహేంద్రవరములోనే పనిలోనుండిరి. అక్షరాభ్యాసమైన తరువాత నేను మొట్ట మొదట మాయింటికిన్నూఱుగజముల దూరములోనున్న గోపాలస్వామి యాలయములో నుండిన యొక చదువులబడికిఁ బంపఁబడితిని. ఆబడిపంతులయిన పులిపాక అమ్మిరాజుగారు తొఱ్ఱినోటివాఁ డగుటచేత నాతఁడు ముక్కుతో మాటాడెడివాఁడు. ఆయనయొద్ద నేమి నేర్చుకొంటినో నే నిప్పుడు చెప్పలేనుగాని గురుఁడెట్టివాఁడో శిష్యుఁ డట్టివాఁ డగునన్న న్యాయముచేత గురువుగారి ముక్కుమాటలు నేర్చుకొన్నాననిమాత్రము నేను నిశ్చయముగాఁ జెప్పఁగలను. ఆయనమాటలను జూచి వెక్కిరించుచు వచ్చుటచేత నా కట్టి