పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

229



గొని గారిడీవిద్య ప్రదర్శించు స్థలమునకుఁబోయెను. నాటివివాహము శ్రీపైడా రామకృష్ణయ్యగారి యింటనే. సుమారు రాత్రి పదిగంటలవేళ పెండ్లియూరేగింపు వారియింటిముందునుండి సాగెను. నియమింపఁబడిన మనుష్యుఁడును పెండ్లి పల్లకితో నూరేగింపునకు ముందే నడుచుచుండెను. పల్లకియు సంకేతస్థలమున సిద్ధముగా నుంచఁబడెను. పెండ్లిపల్లకి తమయింటిముందుకు రాఁగానే లోపలివారు గుమ్మముముందఱ నిలుచుండి వేశ్యలనృత్యగానములను చూచుచుండఁగా, ఆచిన్నది సందడిలో వెలుపలికివచ్చి తనరాకకయి యెదురుచూచుచుండిన మనుష్యునివెంట నడిచి పల్లకిలోఁగూరుచుండెను. తత్క్షణమే పల్లకిమోచువా రా చిన్న దానినిగొని బైలుదేఱిరి. తెల్లవాఱునప్పటికాకస్మికముగా పల్లకివచ్చి మాగుమ్మములోదిగఁగా మేమాచిన్న దానిని లోపలికి తీసికొనిపోయి భద్రముగా నుంచితిమి. చిన్నది కాకినాడ విడువఁగానే తృతీయవివాహవరుఁడైన రామారావుగారు నాకు తంత్రీవార్తను పంపిరి. పెండ్లిపల్లకి తమ గుమ్మము దాటి దూరముగా పోయినతరువాత నా చిన్న దాని తల్లి మొదలయినవారు లోపలికిఁబోయి చిన్నది కనఁబడకపోఁగా పేరుపెట్టిపిలిచి యిందునందువెదకి తొందర పడసాగిరి. కొంతసేపటికి మగవారు గారిడివిద్యనుచూచి యింటికి వచ్చి స్త్రీలవలన జరగినసంగతివిని యాచిన్నది రాజమహేంద్రవరమే పోయినదని నిశ్చయించిరి. ఆచిన్న దాని యన్న గారును మేనమామలును కొందఱు బంధువులును లౌక్యోద్యోగములలోనుండి ప్రబలులుగానున్న వారు; పినతండ్రులు మొదలైనవారు కొందఱు యజ్ఞాదిక్రతువులుచేసి పండితు లనిపించు కొనుచున్న శిష్టసంప్రదాయములోని వారుగానున్నారు. ఆచిన్న దాని మేనమామలారాత్రియే రాజమహేంద్రవరములో తహశ్శీలుదారుగానున్న తమ బంధువైన తణికెళ్ళ జగాన్నాధముగారికిని పోలీసువారికిని తంత్రీవార్తలు పంపిరికాని వారెవ్వరును జోక్యము కలిగించుకొనక యూరకుండిరి. మఱునాఁడు పడవమీఁద బైలుదేఱి చిన్న దానియన్నయు తల్లియు మేనమామలలో నొకరును రాజమహేంద్రవరమునకు వచ్చి బంధువులయింటదిగి మూడవనాటి మధ్యాహ్నము మాయింటికివచ్చిరి. నిన్న దానితల్లి యింతసేపు రోదనముచేసి