పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

స్వీయ చరిత్రము.



నట్టి వివాహములు చేయించుట యసాధ్యమని దంభములు పలుకుచువచ్చిరి. కాకినాడలో నుత్తమవైదికకుటుంబమునందు జననమొంది చదువుకొన్న యొక బాలవితంతువుండెను. వెంకటప్పయ్యగారు వెనుకమాటాడినది యీచిన్న దాని యన్న గారితోనే. ఈచిన్నది వివాహములు జరుచుండుట విని తానుగూడ వివాహముచేసికొనవలెనని మనస్సులో నెంతో యభిలాషపడుచుండెను. ఆ చిన్న దాని యింటియెదుట నున్నయింటిలో తంజావూరి చెలపతిరావుగారను నొక పెద్దమనుష్యుఁడు కాపురముండెను. ఆయనకు మండలకరగ్రాహికార్యస్థానములో లేఖకోద్యోగము. ఆయన వితంతు వివాహములయందు విశేషాభిమానము కలవాఁడగుటచే జాలిపడి యాచిన్నది యొంటిగా తమయింటికివచ్చినప్పుడు వివాహవిషయమైన ప్రసంగము తీసికొనిరాఁగా నామె తనయభీష్టమును దెలియఁ బఱిచెను. ఆచిన్న దాని విషయమై పనిచేయవలెనని యీయననే మేమును గోరితిమి. ఆయన యావఱకే తాను పనిచేయుచున్నట్టు చెప్పి మా ప్రార్థన నంగీకరించెను. ఆచిన్నదియొకనాటి ప్రాతఃకాలమునం దొంటిగా నున్నప్పుడాయనను కలిసికొని, ఆరాత్రిపెండ్లివారు తమవీధినుండి యూరేగునప్పుడు తనకీవలకు వచ్చుట కవకాశముకలుగుననియు, అప్పుడు తన్ను తీసికొని పోవునట్లేర్పాటు చేసినపక్షమున రాజమహేంద్రవరము వెళ్లుదుననియు, చెప్పెను. ఆయన యట్లే చేసెదననిచెప్పి యప్పుడే మూడవ వివాహముచేసికొన్న మామిత్రునితోఁగలిసికొని పల్లకినిబోయీలను సిద్ధముచేసి, చీఁకటిపడ్డ తరువాత పల్లకినొక సంకేతస్థలమునందుంచునట్లేర్పాటుచేసి, చిన్న దానిని పల్లకి వద్దకు తీసికొని పోవనియమించిన మనుష్యునిని ముందుగా నాచిన్న దానికి చూపెను. ఆరాత్రి తొమ్మిదిగంటల కొకచోట నద్భుతమైన గారడివిద్య (Magic) చూపఁబడునని ప్రకటనపత్రికలురాఁగా, చెలపతిరావుగారు దానిని పొగడి ప్రోత్సాహపఱిచి యాచిన్న దానియన్నను మేనమామలను దానినిపోయి చూచుట కొడఁబఱిచెను. ఆయన తాను ముందుగా భోజనముచేసి వారియింటికిఁ బోయి తొందరపెట్టి యెనిమిదిగంటలకే భోజనముచేయించి వారిని తనవెంటఁ