పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

స్వీయ చరిత్రము.



కొమారితను తమ వెంటరమ్మని బహువిధముల బతిమాలుకొనెనుగాని చిన్నది వారికోరిక చెల్లింపక స్థిరచిత్తురాలయి నిరాకరించెను. అన్న గారేమియు మాటాడక తలవంచుకొని నిలుచుండెను. మేనమామ నన్ను చాటునకుపిలిచి మంచి వరుని విచారించి వివాహము చేయవలసినదని చెప్పి, అంతమూర్ఖముగా నిరాకరించుచున్న దానితో సిగ్గులేక యేలమాటాడెదవని యప్పగారిపైని కేకలువేసి, యప్పను మేనల్లునిని వెంటఁగొని మాయిల్లు వెడలిపోయెను. ఈ చిన్న దానికి వివాహముచేయ నుద్దేశించి యామె యన్న గారావఱకు నాతో ననేక పర్యాయములు మాటాడి యుత్తరములువ్రాసిన వాఁడేయైనను, బహిష్కారపత్రికలు వచ్చినతరువాత జడిసి వెనుకతీసి తాను కార్యముచేయుటకు సాహసింప లేక పోయెను. పులవర్తి శేషయ్యయను నొకవైదిక విద్యార్థియుండెను. అతఁడా సంవత్సరము సర్వకలాశాలాప్రవేశపరీక్షకు పోయియుండెనుగాని ఫలితమింకను తెలియలేదు. అతఁడు పరీక్షానంతరమున నన్న గారియొద్దకు గ్రామాంతరము పోయియుండఁగా మనుష్యునిబంపి యాతనిని పిలిపించి యీచిన్న దాని నాతనికి 1883 వ సంవత్సరము జనవరినెల 3 వ తేదిని వివాహముచేసితిమి. ఈ వివాహమునాటికి లక్ష్మినరసింహముగారు బందరునుండి తిరిగి వచ్చినవారయి సహాయులయిరి. ఈవరుఁడు శుద్ధశ్రోతియ వంశమునందు పుట్టి వైదికవృత్తి యందున్న యన్నలను తండ్రినికలఁవాఁడు. దేశాభిమానము కలవారయి యిట్టి ప్రజాక్షేమ కరములైన కార్యములయం దుత్సాహముకలిగి సర్వవిధముల నాకు సహాయులుగానుండిన విద్యార్థులలో నితఁడొకఁడు; తరువాత పదవవితంతు వివాహముచేసికొన్న నల్లగొండ కోదండరామయ్యగా రింకొకఁడు. ఇటువంటి విద్యార్థుల కనేకులకు పాఠశాల జీతములు మొదలయినవిచ్చి యనేక విధముల సాయము చేయుచుండెడి వాఁడను. ఈ యిరువురను తల్లిదండ్రులు స్వజాతి కన్యలను కుదిర్చి వివాహములుచేయఁ బ్రయత్నించినప్పుడు చేసికోక నిరాకరించిన ధైర్యశాలులు. ఇట్టివారనేకులుండిరికాని వారిలో నెవ్వరును తరువాత వితంతువివాహములను చేసికొన్న వారు కాక పోవుటచేత వారినామము లిందుదా హరించుట యనావశ్యకము. ఆకాలమునందు విద్యార్థులు మాకుచేసిన