పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

స్వీయ చరిత్రము.



నది. ఇటువంటి సంతోషదినములలో స్వాములవారు రాజమహేంద్రవరమును విడువక మాపక్షమువారికి మఱింత యవమానముకలుగుటకయి ప్రతిదినమును వాద్యములతో వీధులగుండ నూరేగుచు భిక్షలుచేయుచు కొన్ని మాసములక్కడనే నిలిచియుండిరి. ఆకాలములో స్వాములవారు విధవావివాహముల నెంతనిషేధించుచు వచ్చినను ఘోటక బ్రహ్మచారులైన వారి శిష్యులుమాత్రము రండలతోడ రాత్రు లమంత్రకములైన వివాహములను రహస్యముగా జరుపుచునే వచ్చిరి. పాఠశాలలోని విద్యార్థులు కొందఱీరహస్యమునుకనిపెట్టి యొకనాటిరాత్రి కాచియుండి యొకబ్రాహ్మణ వితంతువుతో సంసారముచేయుచున్న బ్రహ్మచారిశిష్యుని పట్టుకొని, ఆయపూర్వ దంపతులను వీధిలోనికీడ్చుకొనివచ్చి యెల్లవారికినిజూపి యవమానపఱిచిరి. అందుచేత స్వాములవారి శిష్యులకందఱికిని పాఠశాలలోని విద్యార్థులమీఁద విద్వేషముపుట్టి వారీ బాలురమీఁద నేలాగుననైన పగతీర్చుకోవలెనని నిశ్చయము చేసికొనియుండిరి. ఇట్లుండఁగా వారికి సమయము సహితము వెంటనే దొరకినది. రెండుదినములయినతరువాత పగలు పండ్రెండుగంటలవేళ స్వాములవారి శిష్యులు గోదావరిలో స్నానముచేయుచుండఁగా, పాఠశాల విడిచినతరువాత విద్యార్థు లిద్ద ఱక్కడకు స్నానమునకు పోయిరి. వారినిచూచి యాస్వాముల వారిశిష్యులు పాఠశాలంజదువుకొను విద్యార్థుల నందఱినికలిసి తిట్టఁగా, ఎవరు తప్పిదముచేసిరో వారినే తిట్టవలయునుగాని మొత్తముమీఁద తిట్టుట న్యాయముకాదని యొకవిద్యార్థి మందలించినందున వాక్కలహము ముదిరి పిండి వంటలు నిత్యమును తిని బలిసియున్న యా శిష్యు లాచిన్న వానిని పట్టుకొని నిష్కరుణులయి క్రూరముగా కొట్టిరి. అప్పుడక్కడనున్న రెండవ విద్యార్థి పాఱిపోయి యీ సమాచారమును పట్టణములో చెప్పఁగా, పాఠశాలలోని విద్యార్థు లనేకులు కూడుకొని తమతోడిబాలకుని క్రూరముగా ప్రహరించి నందునకయి యాదుండగపు శిష్యులను దండింపవలయునని ప్రతిజ్ఞ చేసికొని గుంపులుకూడి కోపముతో స్వాములవారున్న గృహముముందు వీదిలో తిరుగ