పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

197



సాగిరి. విద్యార్థుల యాగ్రహమునుజూచి భయపడి యాశిష్యులు వీధిలోనికి రాక యింటిలో నడఁగియుండుటయేకాక యిద్దఱా రక్షకభటులను సహాయులనుగా తెచ్చుకొని వాకిటిలో కావలియుంచుకొనిరి. విద్యార్థులాప్రకారముగా రాత్రిజామువఱకును తిరిగి స్వాములవారిశిష్యు లిల్లువెడలివచ్చు జాడ కానక విసిగి నాఁటి కిండ్లకుపోయిరి. శిష్యులటుతరువాత సహితము వీధి మొగము చూచుటకు సాహసింపలేక తమకు కావలసిన వస్తువులను గోడచాటుననుండి పొరుగువారిని బతిమాలుకొని తెప్పించుకొని, దాహశాంతికయి మంచినీరు కావలసిరాఁగా రాత్రి రెండుజాములవేళ నందఱును కఱ్ఱలుగట్టుకొని గుంపుగా బైలుదేఱి యారక్షకభటులను వెంటనుంచుకొని గోదావరికి పోయి నీరుతెచ్చుకొనిరి. మఱునాఁటి యుదయమున యథాప్రకారముగా విద్యార్థులు పాఠశాలకుపోయిరి. ఆమధ్యాహ్నమున వీధులలో విద్యార్థుల సందడి యంతగా కానరాకపోయినందున కొంత ధైర్యము తెచ్చుకొని యా శిష్యులు వీధిత్రొక్క సాహసించి యయిదాఱుగు రొక్కకూటమిగాచేరి బహిర్భూమికి పోవునిమిత్తమయి రెండుమూఁడుగడియల ప్రొద్దుండఁగా గోదావరియొడ్డుననున్న యిసుకతిప్పకేసినడిచిరి. ఈసంగతి యేలాగుననో యొక విద్యార్థికనిపెట్టి తక్కినవారికి సమాచారము పంపెను. ఆశిష్యులును బాహ్యభూమికిపోయి మరలివచ్చుచు గోదావరియొడ్డుననున్న ధాన్యపు పాకలను సమీపించునప్పటికి, వారియెదుట దండధరులవలె కొందఱు విద్యార్థులు కనఁబడిరి. వారు కంటఁబడఁగానే గుండెలు పగిలిపోయి బెదరి ముందుకునడువ కాళ్లురాక బెదరిబెదరిచూచుచు నలుప్రక్కలను చూపునిగిడింపఁగా నానా ముఖముల విద్యార్థులు గుంపులుగుంపులుగా వచ్చు చుండిరి. ఆ సంఖ్యను చూడఁగానే శిష్యులకు మునుపున్న ధైర్యముకూడ మూలముట్టుగ నశింపఁగా నెదిరించుటకు ప్రయత్నముచేయక పిక్కబలముచూపి పాఱిపోవుటకు కాళ్లకు బుద్ధిచెప్పిరి. విద్యార్థులు ముందుకువచ్చి వారిని పట్టుకొని పాదరక్షప్రయోగములచేత బుద్ధిచెప్పి దాసులమనిపించుకొని యా శిష్యూలను విడిచిపెట్టిరి.