పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

195

ఈయంశము నిచ్చటవిడిచి మరల మనవెనుకటి కథకు పోవుదము. లక్ష్మీనరసింహముగారు తెచ్చిన యభియోగము పోయినతరువాత ప్రతిపక్షులు తమకు సంపూర్ణజయము కలిగినదని విఱ్ఱవీఁగుచు విధవావివాహపక్షము మరల నెప్పటికిని తలయెత్తలేకుండ స్థిరముగాచెడినదని పరమానంద హృదయార విందులయి మిన్నందియుండిరి. మాలోని మహాధైర్యవంతులు సహితము మరల వివాహములు కావని యధైర్యపడి నిరుత్సాహులయిరి. ఈ సమయములో మాకు పాఠశాలలోని విద్యార్థులనేకులు పెట్టనికోటగానుండి చేతనయిన సర్వవిధముల తోడుపడినారు ; కొందఱెక్కడకు పొమ్మన్నను పోయి చేయుమన్న పనిని రెండవవారెఱుఁగకుండ చేయుచువచ్చిరి. విద్యార్థులకు మాయందెంత యభిమానముండెనో, వారెంతటి ధైర్యోత్సాహములును విశ్వాసమును కార్యనిర్వహణాసక్తియు లోకోపకార చింతయు కలవారయి యుండిరో, యీక్రింది సంగతివలనఁ గొంతతేట పడవచ్చును -

లక్ష్మీనరసింహముగారి యభియోగము పోయినతరువాత శ్రీశంకరాచార్యులవారును వారిని పురస్కరించుకొనియున్న మాపురమువారును మహోచ్ఛ్రాయదశ యందుండి విజయగర్వముచేత మిన్నును మన్నును గానకుండిరి. ఆయభియోగము పోయినమఱునాఁడు శంకరాచార్యస్వాములవారిని మహావైభవముతో మావీధిని మాగుమ్మముముందఱినుండి గొనిపోయి రాత్రి కరదీపికాసహస్రములతో రాజమహేంద్రపురవీధులలో నూరేగించిరి ; కాని మాయింటిముందఱ నల్లరి యేమాత్రమునుచేయక నిశ్శబ్దముగా సాగిపోయిరి. నాఁడే యావార్తను తంత్రీముఖమున కాకినాడకు పంపఁగా నాలేఖను కాకినాడ పురజనులు పల్లికిలోఁబెట్టి యారాత్రియే యూరేగించి గొప్పయుత్సవముచేసి పయిడా రామకృష్ణయ్యగారి యింటిముందునిలిచి యంతటిధనికుని చెల్లుబడి కలిగినవానిని సహితము లక్ష్యముచేయక, ఆయనగుమ్మమువద్ద చప్పటలుగొట్టి కేకలువేసి చేయఁగలిగినంత యల్లరిచేసిరి. ఈయల్లరియే రామకృష్ణయ్యగారి ధైర్యమును చలింపఁజేసి యాయనను ప్రాయశ్చిత్తమునకు లోఁబడునట్లు చేసి