పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

173



నేనును గవర్రాజుగారును మాత్రము భిన్నాభిప్రాయులమయి యుంటిమి. అయినను మాపక్షమువారిలోని యెక్కువ సంఖ్యగల వారి యభిప్రాయమును బట్టి భోగముమేళముపెట్టుటకు నిశ్చయింపఁబడి ముందుగా కొంతసొమ్మీయఁబడినది. వివాహము జరగవలసినస్థలము మాయిల్లు ; నృత్య గానములు సలుపుటకయి వేశ్యాంగనలను మాయింటిలోపలి కడుగిడనియ్యనని నేను పట్టు పట్టితిని. మాయింటిలోపల నాదిసర్వాధికారము. అందుచేత మావా రూరేగింపు సమయమున బోగముమేళమును పెండ్లిపల్లకిముందు పెట్టుటకు నిశ్చయించి యట్లు గావించిరి. అప్పుడు సహితము నేను పెద్దమనుష్యులకు ముందు వేశ్యలాడుచోటికిఁబోక చూడవచ్చిన గుంపులోఁగలిసి జనులాడుకొను మాటలువినుచు వేడుక ననుభవించు చుంటిని.

ప్రతిపక్షుల ప్రయత్నములను సరకుగొనక మేమును విచ్చలవిడిగా ధనవ్యయముచేసి వారిక్రియలకు ప్రతిక్రియలు చేయుచుంటిమి. వాద్యములు వాయించుటకై వచ్చుటకు కొందఱుమంగలివాండ్రు తమకులమువారికి భయపడుచుండినట్లు కనఁబడఁగా ధనవ్యయమునకు వెనుకతీయక మా పట్టణములోని వాద్యములు వాయించు మంగలివాండ్రనెల్ల మేము పెండ్లిలో మేళమునకు కుదిర్చితిమి. వీరినందఱిని వెలివేసి తమయిండ్లకు రాకుండఁజేసిన పక్షమున క్షురకర్మచేయువారులేకయు శుభకార్యములయందు వాద్యములు వాయించు వారులేకయు మాకంటె తామే యెక్కువకష్టము పొందవలసివచ్చును గనుక మాప్రతిపక్షులు బుద్ధిమంతులయి యట్టిప్రయత్నమును మానుకొనిరి. పిచ్చుక పయి బ్రహ్మాస్త్రముతొడిగినట్లు మాయూరి ప్రముఖులింతమంది యబలలయిన యనాధబాలలమీఁద ధ్వజమెత్తినను, ఈశ్వరుఁడు వారిపట్ల నుండుటచేత ప్రబలులయిన మాయూరిశూరుల యభిమత మీడేఱినదికాదు. నూఱేసి రూపాయలప్పిచ్చియు, భోజనములుగాక నెలకేడేసిరూపాయల చొప్పున జీతమిచ్చి సంవత్సరమువఱకు పనిచేయించుకొనుట కొడంబడికలు వ్రాసియిచ్చియు, వివాహదినములలో దినమునకు నాలుగేసి రూపాయల చొప్పున నియ్య