పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

స్వీయ చరిత్రము.



నొప్పుకొనియు, మేము నలుగురు వంటబ్రాహ్మణులను నీళ్లబ్రాహ్మణులనుసంపాదించుకోఁ గలిగినారము ; ఎంతమంది యాజకులను బెదిళ్లుపెట్టి సాగనంపినను, కట్టకడపట ధైర్యముచేసి వారిమాటవినక వచ్చిన పురోహితునిభార్యను గోదావరిలో పడుటకయి పరుగెత్తించి మరలించినను, నూఱు రూపాయలిచ్చి యావివాహములో మంత్రములు చెప్పుటకొక యాజకుని సంపాదింపఁ గలిగినారము. ఈవివాహ మహోత్సవమును జూచుటకయి యారాత్రి మాపట్టణములోని యూరపియనులు సహిత మందఱును దయ చేసిరి. అల్లరిజరగకుండ వారించుటకయి మాయింటిచుట్టును రక్షక భటు లఱువదిమంది నిలిచి జాగరూకులయి కావలి గాచుచుండిరి ; మండలరక్షకభటశాఖాధ్యక్షుఁడే (District Police Superintendent) స్వయముగా నుండి తగిన యేర్పాటులు చేయుచుండెను ; సంయుక్త దండవిధాయకుఁడే (Joint Magistrate) స్వయముగా రక్షణ క్రమమును విచారించుచుండెను. అందుచేత నాటివివాహము జయప్రదముగా జరగెను. మావంటబ్రాహ్మణులలో నొకఁడు మఱునాఁడు పాఱిపోఁగా పోలీసువారతనిని పట్టితెచ్చి పెండ్లి నాలుగుదినములును వంటయు భోజనములును కాఁగానే వారిని తమయధీనములో నుంచుకొని మరల సాయంకాలము వంటవేళకు తీసికొనివచ్చుచు మాకెంతో తోడుపడిరి.

ఇట్లు ప్రథమ వివాహము నిర్విఘ్నముగా నడచుటయు, అనేకులు తాంబూలములకును భోజనములకును దక్షిణలకును వచ్చుటయు, వాయువేగ మనోవేగములతో మామండలమంతయు వ్యాపింపఁగా తమ వితంతు బాలికలకు వివాహము చేయఁదలఁచుకొన్న వారనేకులు మాపట్టణమునకు రాసాగిరి. అందుచేత మొదటివివాహమయిన నాలవ దినముననే రెండవవివాహముకూడ జరగినది. ఇంకను ననేకవివాహములు జరగునని యనేకు లెదురుచూచుచుండిరి. వివాహమయిన మఱునాటి యుదయమున వార్తాపత్రికలకును మిత్రులకును మేమీ శుభవార్తనుదెలుపుచు బహుస్థలములకు తంత్రీవార్తలను బంపితిమి.