పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

స్వీయ చరిత్రము.



మొగము చాటువేయించుచువచ్చిరి ; కొందఱు వీధులమూలలను మా యింటి యెదుటను గూరుచుండి మా యింటికి వచ్చువారిని మాత్రమేకాక మా వీధిని నడచువారిని సహితము పేరులువ్రాసికొని బహిష్కారపత్రికలు తెప్పించి వెలివేసెదమని బెదరించుచువచ్చిరి. ఇటువంటి దుష్ప్రయత్నములలో విద్యా విహీనులయి వైదికవృత్తియందున్న పూర్వాచారావలంబకులు మాత్రమేకాక యింగ్లీషునందు పాండిత్యముకలిగి పట్టపరీక్షయందును ప్రథమశాస్త్ర పరీక్షయందును కృతార్థులయి మావద్ద విధవావివాహముల కనుకూలముగా మాటాడుచు స్త్రీపునర్వివాహములను తామామోదించినట్లు చేవ్రాళ్లుచేసిన మహానుభావులుకూడ కొందఱుకూడి తామే ప్రధాననాయకులయి తాము చదువుకొన్న విద్యకును పొందిన యున్నతస్థితికినిగూడ నగౌరవము తెచ్చినందున కెంతయు చింతిల్ల వలసియున్నది. ఇట్టి మహానుభావులయిన మా పురములోని బ్రాహ్మణ ప్రభువుల యాలోచనచేత కొందఱు వివాహసమయమున కాగడాలువేయు చాకలివాండ్రను వాద్యములువాయించు మంగలివాండ్రను కూడ రాకుండజేయుటకయి బహువిధముల ప్రయాసపడిరి. వీరివారి నననేల? తుదకు పెండ్లిలో మేళమునకువచ్చిన వేశ్యలనుగూడ వెఱపించి వారియొద్ద నుండి ధనముతీసికొనిరి.

వేశ్యలనఁగానే సంస్కారపరాయణులు చేసెడు వితంతు వివాహములకుఁగూడ బోగముమేళముల నుంచిరాయని సంస్కారప్రియులకు సందేహము కలుగవచ్చును. వితంతు వివాహపక్షము వారికికార్యదర్శినయి వేశ్యల మేళములకు వెళ్లనని ప్రతిజ్ఞను గైకొన్న నే నీవిషయమునఁ గొంచెము సమాధానము చెప్పవలసియున్నది. వివాహవ్యయముల నిమిత్తమయ్యి రామకృష్ణయ్యగారు పంపిన వేయిరూపాయలు మాచేతిలోనున్నవి. తెలుఁగుదేశములో మొదటిదైన యీ వితంతువివాహమును మహావైభవముతో జరపవలెనని మా పక్షమువారి యభిప్రాయము. భోగముమేళములేక వివాహమునకు శోభరాదని రామకృష్ణయ్యగారు మొదలయిన వారందఱును తలఁచియుండిరి.