పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

171



గారి యంతటి ధైర్యౌదార్యశాలి సహిత మీసంక్షోభములో మనస్థ్సైర్యము నిలుపలేక ప్రాయశ్చిత్తము చేసికోవలసి వచ్చినప్పుడు, బయలమిత్రులును బంధు జనులును కులమువారును బహువిధములదూషించి వెఱపించుచుండఁగా, ఇంట భార్యలును తల్లులును బహువిధముల విలపించుచు మనస్సు కలంచు చుండఁగా, మతగురువులు బహిష్కారపత్రికలు పంపి భీతికొలుపుచుండఁగా, సామాన్య జనులు ధైర్యము నిలుపఁగలుగుదురా ? ఇఁక మరల మనవివాహకథకు వత్తము.

ఈ యనర్థమునకంతకును మూలమయిన నాప్రాణములకు సహితము కొందఱు దుష్టులెగ్గుతలఁచిరికాని విద్యార్థులును రక్షకభటులును నాకంగరక్షకులుగా నుండుటచేతను, ప్రభువుల కెల్లను ప్రభువయిన యీశ్వరుఁడే నన్ను కాపాడువాఁడయి యుండుటచేతను, దుష్టులవలన నాకేవిధమైన యపాయమును గలుగలేదు. ఈకార్యములయందు మాకారక్షక శాఖవారివలనఁ గలిగిన సాయ మింతయంతయని చెప్పతరముకాదు. హిందువులయిన రక్షకభటులు సహితము మాకు ప్రతిపక్షులుగానుందురని విన్న వింపఁగా, మామండలారక్షకభటాధికారికరుణించి మాకు తోడుచూపుటకై పయిస్థలములనుండి మహమ్మదీయులను క్రైస్తవులను తగినంతమందిని తాత్కాలికముగా రాజమహేంద్రవరమునకుఁ బిలిపించెను ; మాయింటిచుట్టును తగినంతమంది భటులను కావలి యుంచెను ; ఏదైన అల్లరిజరగినపక్షమున నాయకులను పట్టుకొనెదమని ప్రతిపక్షుల నాయకులకు ప్రకటనపత్రికలను బంపెను. అందుచేత మాప్రతిపక్షులు భయపడి శిక్షాస్మృతినిబట్టి నేరములగు దౌర్జన్యములు చేయుటకు సాహసింప లేక యితరవిధములచేత మాకార్యభంగముచేయ పాటుపడిరి. ఆవఱకు పని లేక సోమరులుగా తిరుగు బ్రాహ్మణవేషధారుల కందఱకును మా మూలమున పుష్కలముగా చేతులనిండ కావలసినంత పనిదొరకినది. కొందఱు మేము కుదుర్చుకొన్న వంటబ్రాహ్మణుల యిండ్లకుఁబోయి వాండ్రను బెదరించియు లంచములిచ్చియు రాకుండఁజేయుచు వచ్చిరి ; కొందఱు వివాహతంత్రము నడుప నిర్ణయించుకొన్న పురోహితులనుపట్టుకొని తిట్టియు భయపెట్టియు