పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

స్వీయ చరిత్రము.



వీరేశలింగముగా రింతపనియు తాము చేసియుందురనియు, ఆయన లేకుండ నాయంతట నేనేమియు చేయలేకుందుననియు, ఆయనతోఁ గలిసికూడ పయిని చెప్పినదానికంటె నధికముగా నిశ్చయముగా నేనేమియు చేసియుండలేదనియు, నామనోనిశ్చయము."

గవర్రాజుగారివలెనే యీపక్షమునఁజేరి వివాహసమయమున భోజనములు చేసినవారందఱును కొంచెముగానో గొప్పగానో యీవిధమైన శ్రమల కోర్చినవారే. పలువురు మార్గాంతరములేక ప్రాయశ్చిత్తములు చేయించుకొని మమ్ము విడువవలసిన వారైనను వారిమనస్సులు మాత్రము మాపక్షముననే యుండెను. ఒకరు రాజకార్యముమీఁద గుంటూరు వెళ్ళవలసిన వారయి యక్కడ నీళ్ళబ్రాహ్మణులు దొరకకయు కాపురముండుట కిండ్లు దొరకకయు బహు బాధలుపొంది. యిష్టములేకయే ప్రాయశ్చిత్తమునకు లోను గావలసినవారైరి ; ఆయన బావమఱఁది మఱియొక రారంభదశయందలికష్టముల కన్నిటికి తాళి కొంతకాలము మాలోనేయుండి యెదిగి యీడేఱి కాపురమునకు సిద్ధము గానుండిన తన తోడఁబుట్టినపడుచును అత్తవారు తీసికొని పోనొల్లకుండినందున ప్రాయశ్చిత్త మంగీకరింపవలసిన వారయిరి ; ఇంకొకరు పెద్ద కుటుంబముగల వారగుటచేత తనకొడుకులను కొమారితలకును సంబంధములు దొరకవన్న భీతిచేత ప్రాయశ్చిత్తము చేసికొనిరి ; దూరదేశముపోయి కన్యను తీసికొనివచ్చిన నామిత్రుఁడు సహితము తనమేనమామ కాలముచేసినప్పుడు గత్యంతరములేక ప్రాయశ్చిత్తమున కొప్పుకొనవలసిన వాఁడయ్యెను. కొందఱు తొందరపడి భయ భ్రాంతులయి యారంభ దశలోనే ప్రాయశ్చిత్తములు చేసికొన్నను, ఇటువంటి భయంకరసమయములో ధైర్యము నిలుపలేక పోయినందుకు నేను వారిని నిందింపను. వివాహములకు బహు సహస్రరూప్యములు గవ్వలవలె వ్యయముచేసి, వివాహములాడిన దంపతుల కాపురముల కిండ్లిచ్చి, మరణసమయమునందు పదివేల రూపాయలిచ్చిన శ్రీపైడా రామకృష్ణయ్య