పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

165



మున కుపక్రమించితిమి. ఈవఱకు చెప్పినట్లు మేము వితంతు కన్యానయ ప్రయత్న మారంభించినది మొదలుకొని తల్లిదండ్రులు భయపడి సమస్తప్రయత్న ములునుచేసి బ్రహ్మచారులైన విద్యార్థులకు బలవంతపెట్టి వివాహములు చేయనారంభించిరి. అందుచేత నావఱకు వివాహమాడ నిశ్చయించుకొన్న విద్యార్థులకు కొందఱికి వివాహములయిపోయినవి. ఉన్న వారిలో కొందఱన్య శాఖవారగుటచేత పనికిరాకపోయిరి. మిగిలినవారిలోనుండి మంచివాని నొక్కని నేర్పఱుచుట కాలోచించుచుండఁగా, ఆవఱకు బహు సంవత్సరములు మాయింట నేయుండి విద్య నేర్చుకొని సర్వకళాశాలాప్రవేశపరీక్షయందు తేఱి, అప్పుడు విశాఖపట్టణములో నారాక్షకశాఖయం దిరువదిరూపాయల పనిలో నున్న యిరువదిరెండు సంవత్సరముల ప్రాయముగల యొకచిన్న వానిభార్య యాకస్మికముగా మరణమునొందుట తటస్థించెను. అతఁడు చిరకాలము నా శిక్షలోనుండి పెరిగినవాఁడగుటచేత వితంతు వివాహములు మొదలైన క్రొత్త మార్పులయందాసక్తియు నుత్సాహమును గలవాఁడు. నేనాతని కీవిషయమున జాబువ్రాయఁగా తా నీచిన్న దానిని వివాహమాడుట కంగీకరించెను. అతఁడు చిన్న వాఁడగుటచేతను విద్యగలవాఁడగుటచేతను వృద్ధికాఁదగిన దొరతనము వారి కొలువునందున్న వాఁడగుటచేతను పలువురాతనికి కన్యనిచ్చెదమని తిరుగుచున్నను వారినందఱిని నిరాకరించి వితంతువును వివాహముచేసికొని బుద్ధి పూర్వకముగా ననేకకష్టములు పొందుటకు సాహసించిన యాతని ధైర్యమును పరోపకార చింతయు నత్యంత శ్లాఘ్యములు. వివాహదినము నిశ్చయింపఁ బడినది. వివాహవ్యయముల నిమిత్తమయి పైడా రామకృష్ణయ్యగారు వేయి రూపాయలు మాకిమ్మని నాళము కామరాజుగారికి వ్రాయఁగా వారా మొత్తమును మాకిచ్చిరి. వివాహమునకుఁగావలసిన పరికరములన్నియు సమకూర్పఁ బడినవి. అయినను విశాఖపుర మండలారాక్షక శాఖాధ్యక్షుఁడు వరునకు సెలవీయుటకు నిరాకరించినందున వివాహమునకు విఘ్నము సంభవించునట్లు కానఁబడెను. కాని యనాథరక్షకుఁడైన యీశ్వరుఁడు మా పక్ష