పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

స్వీయ చరిత్రము.



దక్షుఁడును నగుటచేత తొందరపడి గ్రామము విడిచిరాక మాయుత్తరము నపేక్షించి మామిత్రుఁ డా గ్రామములోనే వేచియుండఁగా, మేము పంపిన మనుష్యుఁడు పోయికలిసికొని 22 వ తేదిని మాలేఖనిచ్చెను. తత్క్షణమే పోవలసినగ్రామమునకు వారు మువ్వురును బైలుదేఱిపోయిరి. ఆచిన్న దాని తల్లి దండ్రులు ధనికులయి గ్రామాధికారులయిన గొప్పవంశమువారు ; ఈకార్యము తల్లికొక్కతెకుతప్ప బంధువర్గములో నెవ్వరికిని ఇష్టములేదు ; ఆచుట్టుపట్టుల నున్న గ్రామములన్నియు వారిబంధువులతో నిండియున్నవి ; ఈ సమాచారము కొంచెము పైకిపొక్కినపక్షమున మోటుగ్రామములవా రెంత దౌర్జన్యమునకు తెగింతురో యెల్లవారు నెఱిఁగియుందురు ; ఆ చుట్టుప్రక్కల మా మిత్రునకు సాయముచేయువా రొక్కరునులేరు. ఇటువంటి విషమస్థితిలో నామిత్రుఁడు కర్తవ్యమును చక్కఁగా నాలోచించి తామెక్కడకుఁ బోవుచున్నారో బండివాండ్రకు సహితము చెప్పక రాత్రి రెండుయామముల కా గ్రామముచేరి ప్రయాసము మీఁద వారియిల్లు తెలిసికొని చిన్న దానితల్లిని లేపి రహస్యముగా తామువచ్చినపని తెలుపఁగా, ఆమె బ్రహ్మానందముగారు రానిదే తాను పిల్లను పంపననిచెప్పెను. నామిత్రుఁడారాత్రి యామె నేలాగుననో బతిమాలి యేమేమోచెప్పియొప్పించి పిల్ల దానిని తమవెంట నొంటిగా వచ్చునట్లొడఁబఱచి తెల్ల వాఱకమునుపే యాచిన్న దానినితీసికొని బైలుదేఱి యాదిన మేగ్రామములోనుదిగి వంటచేసికొని భోజనముచేయక యటుకులే తినియుండి, వెనుకనుండి యెవ్వరువచ్చి పట్టుకొందురోయను భీతిచేత శీఘ్ర ప్రయాణములుచేసి కొన్ని దినములలో తామా చిన్న దానిని సురక్షితముగా రాజమహేంద్రవరమునకుఁ గొనివచ్చి యిరువదియేడవ తేదిని మాయింటివద్ద చేర్చెను. ఆమఱునాఁడే యీవార్త యూరంతయు పొక్కి యాచిన్న దానిని చూచుటకయి జనులు తీర్థప్రజవలె మాయింటికి రాసాగిరి. అందుచేత కొన్ని దినములు మాయిల్లు తిరుమల వేంకటేశ్వరుని యాలయమువలె వచ్చెడి వారితోను పోయెడివారితోను సందడిగానుండెను. అప్పుడు మేము వరాన్వేషణ