పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

స్వీయ చరిత్రము.



మునందుండుటచేత కడపట సర్వమును సానుకూలమయి ముగిసెను. కొంతకాలము మా గోదావరీ మండలారక్షక శాఖాధ్యక్షుఁడయి నాయందు మంచి యభిప్రాయము కలిగియుండిన కర్నల్ పోర్చిస్ దొరగారప్పుడు చెన్న పురి రాజధానిలోని యారక్షకశాఖ కంతకును నధికారి (Inspector General of Police) గా నుండుట తటస్థించెను. నేనాయనకు వ్రాయఁగా నా దొరగారు నాయందనుగ్రహించి వరునకు సెలవిచ్చి వెంటనే పంపవలసినదని విశాఖపట్టణ మండలారక్షక శాఖాధ్యక్షునకు తంత్రీవార్తను బంపుటయేకాక గోదావరీ మండలారక్షక శాఖాధ్యక్షునకు (Police Superintendent) వివాహ సంబంధమున నేను గోరిన సర్వసాహాయ్యములును జేయవలసినదని యాంతరంగిక లేఖను సహితము వ్రాసిరి. విశాఖపట్టణ మండలారక్షక శాఖా ప్రధానకార్యస్థానావేక్షకుఁడు (Police Head Quarters' Inspector) ను నామిత్రుఁడును బ్రహ్మానందముగారి తమ్ముఁడును వితంతువివాహ విషయమున వరుని ప్రోత్సాహపఱచినవాఁడును నయిన దర్భా వేంకటశాస్త్రిగారు వరుని వెంటఁబెట్టుకొనివచ్చి యుక్తకాలములో రాజమహేంద్రవరము చేరిరి. అంతవఱకును జనులు పరిపరిలాగుల నూహలుచేయుటయేకాని వరుఁడెవ్వరో నిశ్చయముగా తెలిసికోఁగలిగిన వారుకారు. వరుఁడు గోగులపాటి శ్రీరాములుగారని తెలిసినతోడనే మాపట్టణములోని యాతని బంధువులు మొదలైనవారువచ్చి వివాహము చేసికోవలదని హితోపదేశములుచేసి కార్యము గానక మరలిపోవుచు వచ్చిరి. వివాహము జరగునని నిశ్చయముగా తెలిసిన తరువాత మా పట్టణమునందు పుట్టిన సంక్షోభ మింతంతయని చెప్పుటకు శక్యముకాదు. ఆవఱకు నిశ్శబ్దముగానుండిన మా పట్టణమంతయును మహా వాయువుచేత సంక్షోభమునొందిన మహాసముద్రమువలె కలఁగ నారంభించినది. ఎక్కడఁజూచినను సభలే ; ఎక్కడఁజూచినను వీధులలో గుంపులుకూడి గుజగుజలాడుచుండుటలే ; ఎక్కడఁజూచినను కోపవాక్యములే ; ఎక్కడఁజూచినను బెదరింపులే.