పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

139

వ్రాయించి తెప్పించి పండితులందఱును దానియందు తమకు తోఁచినవిషయములనుగూడఁ జొప్పించి పుస్తకములోని సంగతులు మాపక్షమువారి కెవ్వరికిని దెలియకుండ రహస్యముగానుంచి, కాశ్యాది ప్రదేశములయందు చిరకాలము వాసముచేసి మంత్రశాస్త్రప్రవీణుఁడని ప్రసిద్ధినొంది మహాతంత్రజ్ఞుఁడైన జోస్యుల పేరిచయనులగారిలోపల నొకసభచేసి, ఆసభకు స్త్రీపునర్వివాహ ప్రతిపక్షులనుమాత్రమే యాహ్వానముచేసి యందఱునువచ్చి కూర్చున్న తరువాత నన్నచటి కాకస్మికముగా నొకపెద్దమనుష్యునిఁ బంపి పిలుచుకొని పోయి, పైగ్రంథమును జదివి యందలియంశముల కాక్షణముననే యుత్తరము చెప్పవలయునని యడిగి నన్ను పరాజితునిఁ జేయఁజూచిరికాని యీశ్వరానుగ్రహమువలన నేను సమయోచితములైన ప్రత్యుత్తరములను జెప్ప నారంభింపఁగా ప్రజలకు తమమాటల యందు విశ్వాసము చెడుననిభావించి యాపండితులు నాయుత్తరములను వినక కడుపునొప్పియని యొకఁడును కాలునొప్పి యని యొకఁడును లేచి పోవఁదొడఁగిరి. అప్పు డాసభామధ్యముననుండి యొక వైష్ణవుఁడు లేచి ముందుకువచ్చి తాను పూర్వాచార పరాయణుఁ డయ్యును దమపక్షమువారు చేయుచుండినయన్యాయమునుజూచి సహింపలేని వాఁడయి "మీప్రతివాదమును వినియెదమని ప్రతిపక్షినిబిలిపించి చెప్పనారంభింపఁగానే వినక కడుపునొప్పి యని కాలునొప్పి యని సాకులుచెప్పి తొలఁగఁజూచుట యేమి న్యాయము ? ఇదియేమిసభ ?" యని యఱచుచు సభనుండి వెడలిపోయెను. సభ్యులందఱు నంతర్ధానము నొందినతరువాత పరమతాంత్రికుఁడైన యాచయనులుగారు నన్నొంటిగాఁబిలిచి నన్నును నాపూర్వులను స్తుతిపాఠములతో శ్లాఘించి పూనినకార్యమునుండి నన్ను మరలింపఁ జూచెనుగాని యాపండిత సత్తమునికోరిక సఫలము గాక, విధవావివాహవృక్షమును మూలచ్ఛేదము చేయుటకయి దీక్షవహించినసభల కాలయమయి బ్రాహ్మణశ్రేణిలో శుద్ధశోత్రియులయిండ్లనడుమ నున్న యీగృహమే తరువాత దైవికముగా విధవావివాహప్రవర్తకసమాజమువారి యధీనమయి పునర్వివాహములు చేసికొన్ననూతన