పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

స్వీయ చరిత్రము.

పాండిత్యము గలవా రగుటచేత నాకు బహు విధముల తోడుపాటుగా నుండిరి. నాకింతలో కాశీ పట్టణమునుండియు కాళీఘట్టము నుండియు బొంబాయినుండియు కావలసిన పుస్తకములన్నియు వచ్చినవి. నేనప్పుడు ముప్పది స్మృతులకంటె నెక్కువగాఁ గొని తెప్పించినాఁడను. అవియన్నియు పూర్ణముగా చదువుటకు నా కప్పుడవకాశము లేక పోయినను, ఈశ్వరుఁడు మాత్రము నాకు సహాయుఁడయియుండుటచేత నే నక్కడక్కడఁ జూచిన భాగములలోనే నా వాదమున కనుకూలమైన ప్రమాణవచనము లనేకము లప్రయత్నముగా నాకు దొరకెను. ఈప్రకారముగా సత్యబలమును దైవబలమును నాపక్షమందుండినట్లు కనఁబడుటచేత ధైర్యము హెచ్చి నేనుత్సాహముతోఁ బనిచేయఁగా, పండితు లుపన్యాసములుచేసిన సభ నాఁడు నాప్రతివాదమును విన్న మీఁదట వివేకులకందఱకును పండితులవాద మసార మైనదనియు స్త్రీ పునర్వివాహము శాస్త్రసమ్మతమనియు నభిప్రాయము కలిగెను. పండితులు నన్ను బహిరంగముగా సభలయం దోడింపలేక బహువిధమాయోపాయములు ప్రయోగింపఁ జొచ్చిరి. కొందఱింటింటికిని వీధివీధికిని దిరిగి శాస్త్రజ్ఞానములేని పెద్దమనుష్యులయొద్దను మూఢ జనుల యొద్దను నేను జేసిన వపార్థములనియు శాస్త్రము స్త్రీ పునర్వివాహ మంగీకరింపదనియు, "కలౌపంచసహస్రాణిజాయంతే వర్ణసంకరాః" అన్న యార్యోక్తినిబట్టి వర్ణసాంకర్యము కలిగి లోకము చెడిపోవుననియు, చాట మొదలు పెట్టిరి. కొందఱు మంచిమాటలు చెప్పియు బహుజనద్వేష మశుభదాయక మని భయ పెట్టియు నయమున భయమున నన్ను మరలింపఁజూచిరి. కొందఱు నన్నకస్మాత్తుగాఁ బిలిపించి వాదములో నోడించి శాస్త్రవిషయమున జనులకుఁ గలుగుచున్న యభిప్రాయమును జెడఁగొట్టఁ బ్రయత్నించిరి. అక్కడిపండితులు తాము వాదమునందు నిర్వహింపలేక యితరస్థలములనుండి పండితులను బిలిపించుటకయి ప్రయత్నించి, ఆవిషయమునను లబ్ధమనోరథులుగాక విశాఘపట్టణ మండలమునుండి దంతులూరి నారాయణ గజపతి రాజుగారిచేత నొక ఖండన గ్రంథమును