పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

స్వీయ చరిత్రము.

దంపతులకాపురము కాలయమయి యిప్పటికి నట్లేయున్నది. నేను మొట్ట మొదట నిచ్చిన యుపన్యాసము ప్రకటింపఁబడఁగానే తెలుఁగుదేశమునం దంతటను స్త్రీ పునర్వివాహవిషయమైన వాదములే ప్రబలి మండనవాదులు నాపుస్తకము నాధారపఱుచుకొని శాస్త్రమును యుక్తులను జెప్పఁబూనుటయు ఖండనవాదులు బహువిధములఁ బూర్వపక్షములుచేయఁ బూనుటయు కొంతకాలము జరగెను. గుంటూరినుండి భువనగిరి పరదేశి సోమయాజులు గారును, బందరునుండి శ్రౌతము కోటీశ్వరశాస్త్రులుగారును, చెన్నపురినుండి కొక్కొండ వేంకటరత్నము పంతులుగారును వర్తమాన రత్నాకరవిలేఖకులును, కాకినాడనుండి మందారమంజరీ పత్రికాధిపతియైన యోగిరాల జగన్నాధముగారును, రాజమహేంద్రవరమునుండి వేదము వేంకటరాయ శాస్త్రులుగారును, విశాఘపట్టణమునుండి దంతులూరి నారాయణ గజపతిరావుగారును, అల్లూరినుండి దాసు శ్రీరాములు పంతులుగారును, ఇంకను ననేకులును నాప్రథమోపన్యాసముమీఁద ఖండన గ్రంథములనువ్రాసిరి. ఈఖండన గ్రంథములయందలి ముఖ్యాంశములకును రాజమహేంద్రవరమునందలి పండితులు చెప్పిన యంశములకును సమాధానముగా శ్రీవిజయనగరముమహారాజు గారిబాలికాపాఠశాలలో అక్టోబరు నెల 12 వ తేదిని జరిగినమహాసభలో నేను నాద్వితీయవిజ్ఞాపనమునుపన్యసించి ప్రకటించితిని. ఇదిగాక బహుస్థలములయం దీవిషయమయి వ్రాయుచువచ్చిన ప్రతివాదులవాదముల కెల్లనుత్తరములను వివేకవర్ధనిలోఁ బ్రకటించుచు వచ్చితిని. తీఱిక యున్నప్పుడితర స్థలములకుఁబోయి యుపన్యాసము లిచ్చుటకును బ్రయత్నించుచు వచ్చితిని. నేను మొట్ట మొదటఁ గాకినాడ కొకభానువారమునాఁడుపోయి స్త్రీపునర్వివాహము శాస్త్రసమ్మతమని హిందూ శాస్త్ర పాఠశాలా భవనములో నొక యుపన్యాసముచేసితిని. నాటిసభకు వందలకొలఁది జనులు వచ్చి విని యానందించిరి. విధవావివాహమునకుఁ బ్రతిపక్షులుగా నున్న తత్పురవాసులగు పండితులు మొదలగువారు తమకు వారముదినములు గడువిచ్చినపక్షమునఁ దా