Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుండేదో లేదో కాని, రాఘవ యీ సన్నివేశాన్ని కల్పించారు. సత్యాగ్రహం చేసి, జైలుకు వెళ్తున్న ఆకాలంలో ఈ సన్నివేశం ఎంతో ఉత్తేజంగా ఉండేది.

1919 జనవరిలో బెంగుళూరులో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో రాఘవ పఠాన్ రుస్తుంగా ప్రదర్శించిన అభినయాన్ని రవీంద్రనాథ్‍టాగూర్ ఎంతగానో మెచ్చుకున్నాడు.

1927లో గాంధీజీ బెంగుళూరు సమీపంలోని ’నందీహిల్స్’లో విశ్రాంతి తీసుకుంటున్నారు. పండిత్ తారానాథ్ (రాఘవ ఆధ్యాత్మిక గురువు) రచించిన హిందీ నాటకం 'దీనబంధు కబీర్ ' నాటకాన్ని చూడవలసిందిగ, గాంధీజీని బెంగుళూరుకు ఆహ్వానించారు. కొన్ని నిముషాలు చూద్దామనుకొన్నాడు గాంధీజీ. గంట అయినా నాటకాన్ని చూస్తూనే వున్నాడు గాంధీజీ. కార్యదర్శిగా వుండిన రాజాజి, 'ప్రార్థనకు వేళైంది' అని గుర్తు చేశాడు. ’మనం ప్రార్థనలోనే వున్నాం కదా?’ అంటూ గాంధీజీ రాఘవ నటన అద్భుతం అన్నాడు. '’రాఘవ మహరాజ్‍కీజై'’ అన్నాడు గాంధీజీ.

1921 - 24 మధ్య రాఘవ ఆంధ్రప్రాంతంలోని పలునగరాలలో ప్రదర్శనలిచ్చాడు. 1927లో రంగూన్‍లో కూడా ప్రదర్శనలిచ్చి పేరుగాంచాడు.

1928 మే 8వ తేదీన రాఘవ ఇంగ్లండుకు బయలుదేరాడు. లండన్‍లో పెక్కు నాటకాలను చూచి, ఆంగ్లనటుల పరిచయం సంపాదించుకొన్నాడు. విఖ్యాత నాటకకర్త, కళావిమర్శకుడు జార్జి బెర్నార్డ్ షాతో రాఘవ కళల గురించి విశ్లేషణ జరిపాడు. కళల గురించి తెలుసుకోవడానికి మీరు ఇక్కడికెందుకు వచ్చారు? మేమే ప్రాచ్య దేశాలకు రావాలి! అన్నాడు షా. "మీరు దురదృష్టం కొద్ది భారతదేశంలో పుట్టారు. ఇంగ్లండులో పుట్టివుంటే షేక్‍స్పియర్ అంత గొప్పవారై వుండేవారు అన్నాడు.

రాఘవ మిత్రుల వత్తిడిపై 1936లో సినిమా రంగంలో ప్రవేశించాడు. హెచ్.ఎం. రెడ్డిగారి 'ద్రౌపదీ మాన సంరక్షణము'లో దుర్యోధనుడుగా నటించారు. గూడవల్లి రామబ్రహ్మంగారి 'రైతుబిడ్డ'లోను, రాజరాజేశ్వరివారి 'చండిక'లోను నటించాడు. సహజ స్వతంత్రనటుడైన రాఘవ సినీ రంగంలో ఇమడలేకపోయాడు.

రాఘవ సమయస్ఫూర్తి చాలగొప్పది. ఒకసారి 'చంద్రగుప్త' నాటకం విజయవాడ దుర్గాకళామందిరంలో ప్రదర్శింపబడుతూవుంది. చాణక్య పాత్రధారి రాఘవ ప్రళయకాల రుద్రునివలె నందులపై ప్రతీకారంకోసం తపిస్తున్నాడు. స్మశానరంగం అది. అంతలో ఆకస్మికంగా ఒకకుక్క రంగస్థలంమీదికి వచ్చింది. రాఘవ ఏమాత్రం చలించక కుక్కను చూస్తూ 'శునక రాజమా, నీకు కూడా నేను లోకువయ్యానా?' అన్నాడు. కుక్క కాసేపు వుండి వెళ్ళిపోయింది. ప్రేక్షకుల సంభ్రమాశ్చర్యాలతో రంగమందిరం దద్దరిల్లింది.

రాఘవ వృత్తిరీత్యా న్యాయవాది. తాను నమ్మిన సిద్ధాంతాలమేరకు న్యాయంగా వున్న కేసులను మాత్రమే చేపట్టేవాడు. క్రిమినల్ లాయర్‍గా బాగా పేరుతోపాటు ధనాన్ని ఆర్జించాడు.