Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని ఆయన మిగుల్చుకున్నదేమీలేదు. నాటక కళాభివృద్ధికే వినియోగించాడు. న్యాయవాదిగ, కళాకారుడుగ పేరు పొందిన రాఘవను 1933లో కొందరు మిత్రులు బళ్ళారి మునిసిపల్‍కౌన్సిల్ కు పోటీ చేయమని ఒత్తిడి చేశారు. రాఘవ, మరి కొందరు మిత్రులు, ప్రముఖ వ్యాపారి ముల్లంగి కరిబసప్ప మున్నగు వారు చాకలి వీధిలో ప్రచారానికి వెళ్ళారు. మిత్రులు ఓటర్లకు రాఘవను పరిచయం చేసి వారికి ఓటు వేయమని కోరారు. ఓటర్లు మౌనంగా వుండి పోవడంతో కరిబసప్ప గారికి కోపం వచ్చి ఓటర్లను తిట్టారు. రాఘవ మనస్సు చివుక్కుమన్నది. వెంటనే ఇంటికి వచ్చి తమ నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకొన్నారు. వారు ఆనాటి నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనారు.

రాఘవ కవి పండితులకు అత్యంతాప్తుడు. ఆయన ఇంట్లో సాయంకాలం బళ్ళారిలోని కవి పండితులు సమావేశమై కళ, నాటకం వగైరాల పఠన లేదా చర్చలలో గడిపేవారు. సరసులు అందరినీ ఎంతో ప్రేమతో పలుకరించే వారు.

బళ్ళారి టీచర్స్ ట్రెయినింగ్ స్కూలులో వున్నపుడు, మా పెదనాన్న భాస్కరాచార్య రామచంద్రస్వామి (కవి, పండితుడు) గారితో పాటు రాఘవ గారిని పలుమార్లు కలుసుకొనే అదృష్టం నాకు కలిగింది. వారు నటించిన నాటకంలో చిన్న పాత్రధారిని నేను.

కులమతాల సంకుచితత్వాలకు అతీతుడాయన. హరిజన బాలుర కోసం సొంత ఖర్చుతో బడిని పెట్టించాడు. పండుగ రోజుల్లో హరిజన విద్యార్థులందరికీ తన ఇంట్లో విందు చేసేవాడు.

కళల కోసం ఎంతో ఉదారంగా పైకం ఖర్చు చేసిన రాఘవ పెళ్ళిళ్ళ పేరిట జరిపే దుబారా ఖర్చులకు దూరంగా వుండే వాడు. పెళ్ళికి రూ.250 మించి ఖర్చుచేయరాదనేవాడు. ఆహ్వాన పత్రికలు చేతివ్రాతలో పంపేవాడు.

రాఘవ స్మృతి చిహ్నంగా బళ్ళారిలో కళామందిరం నిర్మింపబడింది. కేంద్ర ప్రభుత్వం, ఆయన శతజయంతిని పురస్కరించుకొని 'పోస్టల్ స్టాంపు' విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యిటీవల టాంక్‍బండ్‍పై రాఘవ విగ్రహాన్ని నెలకొల్పింది.

నాటక కళాభివృద్ధికి రాఘవ చేసిన సూచనలు కార్యరూపం దాల్చినపుడే ఆయనకు నిజమైన స్మృతి చిహ్నం ఏర్పడగలదు.