Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
మన చరిత్రకు మహోపకారం చేసిన

కల్నల్ కాలిన్ మెకంజీ


"పురుషులందు పుణ్యపురుషులు వేరయా" అన్నాడు మన వేమన.

ఆంగ్లేయులు మన దేశాన్ని మూడు వందల ఏళ్ళు పాలించారు. ఇంగ్లండు నుండి వచ్చిన అధికారులలో దాదాపు 90 శాతం మన దేశాన్ని దోచుకున్నారు.

తక్కిన 10 శాతం కొందరు మాత్రం మన దేశాన్ని, మన భాషలను సంస్కృతిని గౌరవించారు. మన ప్రజలను ప్రేమించారు. ఆ కొందరే వేమన అన్నట్లు పుణ్య పురుషులని చెప్పవచ్చు. ఆ కొందరు మనం మరవరాని, మరవకూడని వారు. వారెవరు? వారిలో ముఖ్యమైన వారెవరు? తెలుగు ప్రజలు మరవరాని వారిలో మొదటి ఆంగ్లేయుడు సర్ థామస్ మన్రో. అతడు శాంతిభద్రతలను సుస్థిరమొనర్చి, రైతులకు ఎంతగానో సహాయపడినాడు.

అగ్గిపురుగులకు ఆహారం అవుతున్న తెలుగు కావ్యాలను వేలాదిగా సేకరించి శుద్ధ ప్రతులు వ్రాయించి, నిఘంటువులను సమకూర్చి తెలుగు సాహిత్యానికి మహోపకారం చేసిన దొర సి.పి.బ్రౌన్. గోదావరిపై ఆనకట్ట కట్టించి, మరెన్నో జలాశయాలు నిర్మింపజేసి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం కావించిన అన్నదాత సర్ ఆర్థర్ కాటన్.

మన చరిత్రకు కావలసిన ముడి సరుకును సమకూర్చి, మెకంజీ కైఫియత్ లుగా పేరుగాంచిన అమూల్యమైన చరిత్రలను మనకు అందించిన మహనీయుడు కల్నల్ కాలిన్ మెకంజీ.

మెకంజీ స్కాట్లండుకు పడమరగా వున్న లూయీ అనే ద్వీపంలోని స్టార్నొవే అన్న గ్రామంలో క్రీ.శ. 1754లో జన్మించాడు. తండ్రి మర్దొక్ మెకంజీ. తల్లి బార్బరా మెకంజీ. తండ్రి చిన్న వ్యాపారాలు చేస్తూ తన గ్రామంలో పోస్టు మాస్టరుగా వుండేవాడు.

స్టార్నొవేలోని బడిలో చదువు సాగించాడు కాలిన్ మెకంజీ. గణితంపట్ల ఆసక్తి ఎక్కువగా వుండేది. కొంతకాలం స్టార్నొవేలోనే పన్నులు వసూలు చేయు ఆఫీసులో గుమస్తాగా పనిచేశాడు మెకంజీ. జాన్ నేపియర్ అను సంపన్నుడు మెకంజీని తనకు సహాయకుడుగా వేసుకొన్నాడు. నేపియర్ పూర్వీకులలో గొప్పవాడైన జాన్ నేపియర్ చరిత్ర వ్రాయుటకు కావలసిన ఆధారాలన్నీ సేకరించాడు. జాన్ నేపియర్ గణిత శాస్త్రమునకు చాలా అవసరమైన "సంవర్గమానములు" లోగరిథమ్స్ కనిపెట్టాడు. విషయ సేకరణలో మెకంజీ అతనికి బాగా తోడ్పడినాడు. అప్పుడే భారతీయ గణిత శాస్త్ర విషయం తెలుసుకున్నాడు.

నేపియర్ చనిపోయిన తర్వాత మెకంజీ 1782 లో మదరాసుకు వచ్చాడు.