పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గండి క్షేత్రంలోని ఆలయం దర్శించాడు. కొండలోయ మధ్య అతనికి బంగారు తోరణం కన్పించిందట. అది పరమభక్తులకే కనిపిస్తుందని నమ్మకం. చూచినవారు ఆరుమాసాలకు మించి బ్రతకరన్న నమ్మకం వుండేది. ఏదెట్లున్నా సర్ థామస్ మన్రో, ఆరునెలల్లోనే కలరా సోకి 7-7-1827న మరణించాడు. ఆయన శరీరాన్ని గుత్తి పట్టణంలో ఖననం చేశారు. ఆయనపేర నేటికీ గుత్తిలో సత్రం ఉంది.

రాయలసీమ రైతుల పాలిట పెన్నిధిగా ప్రశంసింపబడిన మన్రో శిలా విగ్రహాన్ని పత్తికొండ తాలూకా కార్యాలయం ఎదుట స్థాపించారు.

తాడిపత్రిలోని చింతల రాయస్వామి ఆలయ ఆస్థాన మంటపాన్ని, కళ్యాణ మంటపాన్ని మరమ్మత్తు చేయించాడు. ఆలయంలో సక్రమంగా పూజలు జరిపే ఏర్పాటు చేశాడు. రాయదుర్గంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించాడు. ఆలయానికి మాన్యాలిచ్చాడు.

1807లో బళ్ళారి-మైసూరు సరిహద్దు తగాదా వచ్చింది. సరిహద్దు గ్రామాల ప్రజలు కొట్టుకున్నారు. వారిలో దెబ్బతిన్న వాడొకడు "అనంతపురం వెళ్ళి అయ్యకు చెబుతాను" అన్నాడు. ఆ అయ్య సర్ థామస్ మన్రోయే. ప్రజలు ఆయనను "మండ్రోలప్ప" "మండ్రోలయ్య" అని పిలిచేవారు. మాండవ్య ఋషి అంశం కలవాడంటారు.

ప్రజల మన్ననలందుకుని, రైతు జనబాంధవుడిగా నివాళులందుకొన్న సర్ థామస్ మన్రో చిరస్మరణీయుడు.