పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1807లో మన్రో కలెక్టర్ పదవికి రాజీనామా చేసి లండన్ చేరాడు. మద్రాసు ప్రభుత్వం రైత్వారి విధానాన్ని రద్దు చేసి గ్రామీణ శిస్తు విధానాన్ని అమలుపరచింది. శిస్తు ఒక సంవత్సరం నుండి మూడేళ్ళపాటు వసూలు చేసే హక్కు గ్రామపెద్దకు లభించింది. మరల అగ్రవర్ణాల ఆధిపత్యం మొదలైంది. 1820లో మద్రాసు గవర్నర్ గా వచ్చిన మన్రో పాత విధానాన్ని అమలు చేశాడు.

ఆ కాలంలో రాయలసీమలో 80 మంది పాలెగాళ్ళుండేవారు. వారిలో కడప జిల్లాలోని వేముల, చిట్వేలి, పోరుమామిళ్ళు, నరసాపురం, అప్పిరెడ్దిపల్లి, ఉప్పులూరు, కమలాపురం పాలెగాళ్ళు ముఖ్యులు. వీరు నిరంకుశులు. గ్రామాలను దోచుకునేవారు. బందిపోట్లుగా వారి అనుచరులుండేవారు. హైదరాలి, నిజాం, గోల్కొండ నవాబులు కూడా వారిని అరికట్టలేకపోయారు. మన్రో తీవ్ర చర్యలతో వీరి ఆట కట్టించాడు. పాలెగాళ్ళను, కావలి వాళ్ళను కఠినంగా శిక్షించాడు.

అరాచకంగా వున్న రాయలసీమ జిల్లాల్లో జిల్లా కోర్టులు, పోలీసు యంత్రాంగాలు ఏర్పాటు చేశాడు. మన్రో కఠినచర్యల వల్ల సుస్థిరమైన పాలన ఏర్పడింది. పాలనాపరమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.

1813 లో ఛార్టర్ చట్టానికి సంబంధించిన పార్లమెంటు కమిటీ ముందు సాక్ష్యమిస్తూ, భారతదేశ సంస్కృతిని అనుసరించటం వల్ల ఇంగ్లండు లాభపడుతుందన్నాడు. భారతీయులు తయారుచేయు వస్తువుల నాణ్యత, యూరప్ తో సమానమైనదన్నాడు. భారతీయ ప్రజల పట్ల, మేధావుల పట్ల, చేతి వృత్తుల వారిపట్ల ఎంతో గౌరవముండేది.

భారతీయులు తెలుగు, ఇంగ్లీషు భాషలు నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందటానికి వీలుగా జిల్లా తాలూకా స్థాయిలో పాఠశాలలు నెలకొల్పారు. 1805 నాటికే మన్రో తెలుగు వ్రాయను, చదవనూ నేర్చుకొన్నాడు. రాయలసీమ రైతులతో ఆయన తెలుగులో మాట్లాడేవారు. తన క్రింది అధికారులు కూడా విధిగా తెలుగులోనే వ్యవహరించాలని ఆదేశించాడు. సి.పి.బ్రౌన్ ఆయన మాటలనెంతగానో గౌరవించేవాడు.

భూస్వాములు రైతులకు అన్యాయం చేస్తున్నట్లు వార్త వచ్చిన వెంటనే వారి వద్దకు వెళ్ళి వారి కష్టసుఖాలను విచారించేవాడు. మైళ్ళ తరబడి కాలినడకన గ్రామాలను చూచేవాడు. పూడిపోయిన చెరువులు కనబడిన వెంటనే పూడిక తీయించే ఏర్పాటు చేసేవారు.

మన్రో భారతీయులను పెద్ద పదవులలో నియమించాడు. ధర్మవరం ప్రాంతం వాడైన, దేశాయి నారాయణప్పను 800 రూపాయల నెలవేతనంపై మద్రాసు రెవిన్యూ బోర్డు దివానుగా నియమించాడు. మైసూరు దివాన్ పూర్ణయ్య వద్ద శిక్షణ పొందిన బచ్చేరావు కార్యదక్షతను గుర్తించి కడప తాలూకాలోని పుట్టంపల్లె, పులివెందుల తాలూకాలోని ఇడుపులపాయ గ్రామాలను జాగీరుగా యిచ్చాడు.