పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కలము, నిప్పులతో గఱిగిపోయె
యిచ్చోట ; నేభూములేలు రాజన్యుని
యధికార ముద్రికలంతరించె
యిచ్చోట ; నేలేత ఇల్లాలి నల్లపూసల
సౌరు, గంగగలసిపోయె
యిచ్చోట ; నెట్టి పేరెన్నికంగొన్న
చిత్రలేఖకుని కుంచియనశించె
ఇది పిశాచులలో నిటలేక్షణుండు
గజ్జెగదలించి యాడురంగస్థలంబు
ఇది మరణదూత తీక్షణ దృష్టులొలయ
నవని పాలించు భస్మ సింహాసనంబు

జాషువా గారి రచనలన్నీ ఖండకావ్యాలు, వాటిలో పిరదౌశి, గబ్బిలము, కాందిశీకుడు, ముంతాజమహల్, స్వప్నకథ నేతాజీ, క్రీస్తు చరిత్ర, కొత్తలోకము ప్రసిద్ధములైనవి. ఆత్మకథను మూడు సంపుటాలుగా ' నా కథ ' అను శీర్షికన వ్రాశారు.

జాషువా కవి కర్ణుని తలపింపజేస్తారు. ' కర్ణుండేమాయె కులపరీక్షకుల నడుమ? ' అని ప్రశ్నిస్తారు.

కురుకుమారుల సభలో, కర్ణునికి జరిగిన అవమానమే కవితా సదస్సులో తనకు జరిగిందన్నారు. సూర్యారావు బహదూర్ గారి దర్శనం తర్వాత కవి కులాన్ని గూర్చిన ప్రశ్న రావటం జాషువాగారి నెంతగానో బాధించింది.

' నా కవితా వధూటి వదనంబు నెగాదిగాజూచి, రూప రే
ఖా కమనీయ వైఖరుల గాంచి, ' భళీ భళీ ' యన్నవాడే ' మీ
రేకుల ' మన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో
బాకున క్రుమ్మినట్లుగును పార్థివ చంద్ర; వచింప సిగ్గగున్ '

అని ఆవేదన చెందారు.

ప్రతిభను కులమతాలతో కొలవటం తీవ్రంగా ఖండించారు.

జాషువాకవి జంతువుల పట్ల, పక్షుల పట్ల ఎంతో దయగలవారు.

ఒకమారు ఆయన వార్ధాకు గాంధీజి దర్శనం కోసం వెళ్లారు. అక్కడున్న ఒక రాజకీయ నాయకుడు జాషువాగారిని, ఒక జర్మన్ పండితునికి పరిచయం చేస్తూ ' ఈయన క్రైస్తవ కవి ' అన్నాడట. ఆ విదేశీ పండితుడు ఆశ్చర్యంతో ఆ నాయకునివైపు చూశాడట. కవితకు కులమతాల ముద్రలు వద్దంటారాయన. జాషువాగారు, గోపరాజు రామచంద్రరావు (గోరా) గారితో వియ్యమందుకొన్నారు.

గుంటూరులోని భూస్వామి ఏకా ఆంజనేయులుగారు జాషువాగారికి ఒక ఎకరా సుక్షేత్రమైన పంటభూమిని దానంగా ఇచ్చారు. మిత్రులు వారికొక ఇల్లు కట్టించి ఇచ్చారు. కనకాభిషేకాలు, గజారోహణాది సత్కారాలు, గండపెండేరాలు మున్నగు