పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సంస్థల్లో అధ్యాపకులుగా పనిచేశారు. ' ఉభయ భాషా ప్రవీణ ' పట్టం పుచ్చుకొన్న జాషువా గారు 1928-42 మధ్య గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలల్లో తెలుగు పండిత పదవి సాగించారు. 1942-45 మధ్య బ్రిటీష్ ప్రభుత్వ యాజమన్యంలో భారత ప్రభుత్వం నెలకొల్పిన జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకులుగా పనిచేశారు. 1957-59 మధ్య మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ' ప్రొడ్యూసర్ ' గా ఉద్యోగం నిర్వహించారు. 1964 లో ఆంధ్ర ప్రభుత్వం జాషువా గారిని శాసనమండలికి నామినేట్ చేసింది.

ఏ ఉద్యోగం చేసినా అది జీవికకు మాత్రమేసాధనం. ఆయన జన్మతః కవి. కాని కవిగా బ్రతుకు సాగించడం అసాధ్యమని ' బడిపంతులు ' అయ్యారు.

చిన్నప్పుడు వినుకొండలో కొప్పరపు సుబ్బారావుగారి అవధానం విన్నాడు. అవధానం ముగిసిన తర్వాత కొందరు కవులు అవధానిని ప్రశంసిస్తూ పద్యాలు చదివారు. బాలజాషువా కూడా పద్యాలు వ్రాసుకొని, చదవటానికి వేదిక నెక్కాడు. ' అంటరాని వారు వేదిక ఎక్కడమా? పద్యాలు వ్రాయడమా? ' అని తరిమి వేయటం బాలజాషువా ను ఎంతగానో కృంగదీసింది.

జాషువాగారు అకుంఠిత దీక్షతో కావ్యరచన కుపక్రమించారు.

' విశ్వమానవ సౌభ్రాతృత్వం, నిర్మత నిర్జాతి సంఘం నా ఆదర్శం. ఒక జాతికి ఒక మతానికి చెందిన కవిత్వాలు మంచివి కావు. అవి కవిత్వాలే కావు. అలాంటివి వీలునామా కవిత్వాలు అంటాను. నా భావం సామాన్యులకు అందివ్వడానికే ప్రయత్నించాను. గహన సంచారం లేని కవిత్వం నాలక్ష్యం ' అన్నారాయన.

' నవ్యయుగోచింతంబులై ఆకటి చిచ్చు లార్చు హృదయ విదారి దయా కథాంశాలు ' ఆయన కవితకు వస్తువులు. మానవత్వం హేతువాదం జాషువా గారి కవితలకు మూలాధారాలు.

కరుణరసం ఆయన కవితల్లో తొణికిసలాడుతుంది.

' కరుణ రసమొకండె కఠిన రాక్షసముల్
హృదయములను గలచిముదము గూర్చు
వేడికంటి నీటి విలువ సహజమైన
చలువలీను అశ్రువులకు లేదు '

అన్నారు ' ముసాఫిర్ ' అనే కావ్యంలో

' కఠిన చిత్తుల దురాగతములు ఖండించి
కనికారమొలగించుకలమునాది '

అని ఎలుగెత్తి చాటారు

" నిమ్మజాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును కాల్చివేయునని " హెచ్చరించారు

అస్పృశ్యులు పండించే ధాన్యం ఆలయాలలో దేవునికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కాని ఆ ధాన్యం పండించే కృషికులకు ఆలయ ప్రవేశం కూడా లేదు అంటూ: