పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మార్మోగింది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకొని బంగారు పతకంతో పాటు 'రంగ భూషణ' బిరుదంతో సత్కరించారు.

కర్ణాటక సంగీతంలోనే కాక, హిందుస్తానీ సంగీతంలో కూడా దిట్ట నాగయ్య. కాని జీవితంలో కష్టాలెదురైనాయి. తండ్రి మరణించాడు. మొదటి భార్య ప్రసవించిన తర్వాత తల్లి, బిడ్డ చనిపోయారు. రెండవ భార్య ఆయనకు దూరమైంది. మనశ్శాంతిలేని నాగయ్య రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. పుణ్యక్షేత్రాలు చూశాడు. 'నీ కార్యక్షేత్రం కళారంగం, వెళ్ళు మరళా కళాకారుడవై ఆత్మ శాంతిని సాధించు' అని అంతరాత్మ బోధించింది. మరలా చిత్తూరు చేరాడు.

1932 లో జాతీయ కాంగ్రెస్ లో స్వయం సేవకుడుగా చేరి మద్రాసు వెళ్ళాడు. ప్రకాశం పంతులు, సత్యమూర్తి, రాజాజీ మున్నగు నాయకుల పరిచయం కలిగింది. గుమస్తా ఉద్యోగానికి రాజీనామా యిచ్చాడు. లాఠీ చార్జీలు, లాకప్ లు చవిచూశాడు. వార్దాకు వెళ్ళి గాంధీజీని దర్శించాడు. తిరిగి మద్రాసు వచ్చాడు. రాజకీయరంగం వదలి మరలా కళారంగంలో అడుగు పెట్టాడు. ఫిల్ము కంపెనీలు పెడతామని కొందరు ప్రలోభపెట్టి నాగయ్యను వంచించారు.

చేత చిల్లిగవ్వలేక మద్రాసు వీధుల్లో తిరుగుతూ, ఆకలి బాధతో నుంగంబాకంలో క్రింద పడిపోయాడు. దారిన పోతున్న హచ్చిన్స్ కంపెనీ యజమాని, నాగయ్య పాత మిత్రుడు అయిన అచ్యుతనాయుడు నాగయ్యను గుర్తుపట్టి భోజన వసతులు కల్పించాడు.

నాయుడుగారి ప్రోత్సాహంతొ నాగయ్య ఎన్నో గ్రాంఫోను రికార్డులిచ్చాడు. "హిజ్ మాస్టర్స్ వాయిస్" కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమించుకొన్నారు. నాగయ్య పాడిన రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయాయి.

1935 లో బి. ఎన్. రెడ్డి గారిని నాగయ్య కలుసుకొన్నాడు వెంటనే రెడ్డిగారు తమ మిత్రులైన హెచ్. ఎం. రెడ్డిగారికి నాగయ్య గారిని పరిచయం చేశారు. హెచ్. ఎం. రెడ్డి నాగయ్య కంఠ మాధుర్యానికి పరవశుడయ్యాడు. తాను తీసే "గృహలక్ష్మి" చిత్రంలో సంఘ సేవకుని పాత్ర యిచ్చాడు. ఆ వేషంలో నాగయ్య పాడిన, "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రతిధ్వనించింది. అప్పట్లో మద్యపాన నిషేధం అమలులో వుండేది కాన ఆ పాటకు జనాదరణ అమితంగా లభించింది.

బి. యన్. రెడ్డిగారు మూలానారాయణ స్వామితో కలిసి వాహినీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించారు. వందేమాతరం, సుమంగళి, దేవత, మున్నగు చిత్రాల్లో నటించిన నాగయ్యకు అశేష పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

"ఫిల్మ్‌ ఇండియా" సంపాదకుడు నాగయ్య నటనా వైదుష్యాన్ని వేనోళ్ళ