Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉద్యోగిగా వుండేవారు. చిన్నప్పటినుండి భాగవత, భారతాల పట్ల అమితమైన ఆసక్తి నాగయ్యకు, తండ్రి చక్కని సంగీత విద్వాంసుడు, పండితుడు. తండ్రి సంగీత కళాభిజ్ఞత తనయుడుకని బాల్యంలోనే ఆకర్షించింది.

తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించాడు. పాఠశాలకు వెళ్ళడం కంటే సంగీత కచ్చేరీలకు వెళ్ళటం ఎంతో సరదాగా వుండేది బాల నాగయ్యకు. దూరంగా వున్న ఒక వూళ్ళో సంగీత కచ్చేరి జరుగనున్న విషయం విన్నాడు. ఇంట్లో మాట మాత్రం చెప్పక తన చెవి పోగుల్ని అమ్మి ఆ డబ్బుతో రైలు టిక్కెట్ కొని సంగీత కచ్చేరి విని ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు సంగీతాభిరుచిని గుర్తించిన తండ్రి, కుమారుణ్ణి సంగీత విద్యాభ్యాసం కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళె వద్దకు పంపాడు.

ఒకమారు మహా విద్వాంసులైన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిళ్ళె గార్ల సంగీత కచ్చేరీకి నాగయ్య హాజరయ్యాడు. కచ్చేరి పూర్తి అయ్యింది. శ్రోతలందరు వెళ్ళి పోయారు. నాగయ్య మాత్రం అలాగే నిల్చుని పుష్పవనం అయ్యర్ వంక అదే పనిగా చూడసాగాడు. అయ్యర్, " ఏం అబ్బాయ్, ఏం కావాలి? నీ పేరేమి?" అని ప్రశ్నించాడు. నా పేరు 'ప్రహ్లాదుడు' అని జవాబిచ్చాడు బాలుడు. 'సరే కాని, నీకేమైనా సంగీతం వచ్చా' అని అడిగాడు. 'ఓ-వినండి' అంటూ భాగవతంలోని ప్రహ్లాదుని పద్యాలను మధురంగా భావయుక్తంగా పాడాడు. గోవింద స్వామి పిళ్ళె ఆనందంగా వయోలిన్ వాయించాడు. రెండు గంటలసేపు పద్యాలు పాడాడు. అయ్యర్ ఆనంద పరవశుడై 'బాబు, నీవు గొప్ప కళాకారుడవుతావు' అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను పలుమార్లు మిత్రులకు చెప్పేవాడు నాగయ్య.

కంచిలో నయన పిళ్ళే వద్ద, కుంభ కోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాధ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించాడు నాగయ్య. చిత్తూరులో మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలో అతని చదువు కొంతవరకు సాగింది. మనసంతా సంగీతంపై వున్నపుడు కాలేజీలో చదవటం ఎలా సాగుతుంది? కాలేజీ చదువు అర్ధంతరంగా ముగిసింది. విద్యార్థిగా నాటకాల్లో వేషాలు వేసి ప్రశంసలందుకొన్నాడు.

మద్రాసులో చదువుకు 'గుడ్ బై' చెప్పిన నాగయ్య చిత్తూరు జిల్లా బోర్డు ఆఫీసులో గుమస్తాగా చేరాడు. స్థానిక రామ విలాస సభ నాటక సంఘం వారితో పరిచయం లభించింది.

చిత్తూరులో రామ విలాస సభ, లక్ష్మీ విలాస సభ, మద్రాసులో సుగుణ విలాస సభ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మున్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో, మొదట సావిత్రి, దమయంతి, చిత్రాంగి వేషాలు ధరించి ప్రశంసలందు కొన్నాడు.

నాటకరంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రా రెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించాడు. రామదాసులో కబీరు వేషధారిగా కహో రామ్‌ నామ్‌ అంటూ పాడుతూ రంగ ప్రవేశం చేయటంతోనే