సర్.సి.వి. రామన్
మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ తరగతి గది. ఆంగ్ల పద్య భాగమును బోధించు ప్రొఫెసర్ ఇలియట్ తరగతిలో ప్రవేశించి విద్యార్ధలందరినీ ఒక మారు కలయజూచాడు. మూడవ వరుసన కూర్చున్న ఒక విద్యార్ధిని చూచి ఆశ్చర్యంతో ...
'నీవీక్లాసు విద్యార్ధివేనా?' అని ప్రశ్నించాడు. ఆ దినమే అతడు కళాశాలలో చేరాడు.
'ఔను, సర్, నేను ఈ తరగతి విద్యార్ధిని, నా వయసు 13 ఏళ్ళు. ఇంటర్‌మీడియట్ విద్యను వాల్టేర్ కాలేజీలో పూర్తి చేశాను. నా పేరు సి.వి. రామన్' అన్న సమాధానం నిర్భయంగా చెప్పాడు. ప్రొఫెసర్ వేసిన ప్రశ్నలన్నింటికీ ధైర్యంగా చకచకా చెప్పాడు. ప్రొఫెసర్, ఆ బాలుని తెలివితేటలకు ముగ్ధుడయ్యాడు. నాటి నుండి ప్రొఫెసర్ ఇలియట్ ప్రియశిష్యులలో ఒకడయ్యాడు సి.వి. రామన్.
చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు.