పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిశోధన సాగిస్తున్న యువ పరిశోధకురాలు క్షయవ్యాధితో శ్యానిటోరియం చేరింది. ఆమె చికిత్స కోసం తమ వేతనం నుండి 6 సంవత్సరాలపాటు ఆర్థికసాయం ప్రతి నెలా పంపేవారు. తాను అనాధనని ఏ రోగీ భావింపరాదని చెప్పేవారాయన.

'నేను పుట్టుకతో ఏమీ పట్టుకుని రాలేదు. చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళను. నా ఆదాయ వ్యయాలు నా జీవనోపాధికి తగినంత వుండిన చాలు' అన్న ఉదారాశయం కలవారు సుబ్బారావుగారు.

ఆయన నైష్టిక బ్రహ్మచారి. క్రిస్టమస్ పండుగనాడు ఎందరో బీదపిల్లలకు ఉదారంగా కానుకలిచ్చేవారు. విజ్ఞాన శాస్త్రవేత్త అయిన సుబ్బారావుగారు ప్రగాఢ దైవభక్తిగలవారు. వేకువనే ప్రార్ధన చేయనిదే ఏ పనీ ప్రారంభించేవారు కారు. తనను ప్రోత్సహించిన సహకరించిన రామకృష్ణ మఠం వారికి క్రమంగా ధన సహాయం చేసేవారు.

1948 లో ఆయనకు అమెరికా పౌరసత్వమిచ్చి గౌరవించింది. లెడర్లీ వైద్యపరిశోధనా కేంద్రం ముఖ ద్వారం దాటిన తర్వాత పెద్ద కాంస్య ఫలకంపై ఉన్న డా.యల్లాప్రగడ సుబ్బారావుగారి చిత్రం క్రింద "యల్లాప్రగడ సుబ్బారావు - 1886-1948 పరిశోధకులు, విద్యావేత్త, తత్వవేత్త, దయామయుడు. లెడర్లీ పరిశోధనా సంస్థ డైరెక్టర్." అన్న వాక్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. సోదర ప్రజానీకం రోగ విముక్తులు కావాలన్న తపనతో రేయింబగళ్ళు కృషి చేసిన డాక్టర్ యల్లాప్రగడ వారు 'కరోనరి త్రాంబసిన్' వ్యాధితో 1948 ఆగష్టు 9వతేదిన అమెరికాలో కన్నుమూశారు.

ఈ ప్రముఖ భారతీయ వైద్యుని పట్ల గౌరవసూచకంగా బొంబాయిలోని బల్సార్‌లో నిర్మించిన తమ ప్రయోగశాలకు డా. యల్లాప్రగడ సుబ్బారావు సంస్థ అని నామకరణం చేశారు లెడర్లీ సంస్థ వారు.

ఆయన మానవాళికందించిన వైద్యవిధానాలు చిరకాలం జీవించి ఉంటాయి.