పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అవతరించింది. ఆంధ్రనాయకుడైన ప్రకాశం ముఖ్యమంత్రిగా కర్నూలు రాజధానిగ ఆంధ్ర ప్రజల కోర్కె ఫలించింది. ప్రకాశంగారు గుంటూరులో హైకోర్టు, తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నెలకొల్పారు. కేంద్రప్రభుత్వం మంజూరు కోసం వేచివుండక కృష్ణాబ్యారేజీ నిర్మింపచేశారు. కాని ఏడాదిలోపే ఆయనపై అవిశ్వాసతీర్మానం పెట్టారు. పదవి పోయినా ప్రజలాయనను మహారాజుగా గౌరవించారు.

ప్రకాశం మహాసాహసి. రోమన్ సేనాపతిలా అచంచలమైన పట్టుదలగల మొనగాడు. కష్టసుఖాలను సమభావంతో చూచిన స్థితప్రజ్ఞుడు. కృషియే పరమాత్ముని పూజగా భావించినవాడు.

ప్రకాశం లక్షలార్జించినా, చివరికో చిల్లిగవ్వను సైతం దాచుకోలేదు. చరమదశలో రాష్ట్ర ప్రభుత్వంవారు ప్రకాశంగారికి నెలకు రు.750/- గౌరవభృతి సొంతవుపయోగానికి ఒక కారు యిచ్చారు.

ఆంధ్రజాతికి తిరుగులేని నాయకుడుగా వెలిగిన ప్రకాశం వీరుడైన భీష్మునిలా మరణించారు. 1957 మే నెల 20వతేదీన ఆయన దివంగతులయ్యారు.

"భవ్య గుణముల దివ్యఖనియై
భారతాంబకు ముద్దుబిడ్డయి
గాఢమైన స్వరాజ్యకాంక్షల
గండుమీరిన శూరుడాతడు
సరిసములులేనట్టి యాతడు
ప్రజలకున్ దేశాభిమానము
పంచిపెట్టిన నేతయాతడు"