పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్నో ప్రయత్నాలు చేసింది. "స్వరాజ్య" పన్నేండేళ్ళు నడిచింది. లక్షల్లో అప్పులు చేశారు ప్రకాశంగారు. తనబంగళాలను అమ్మి అప్పులు తీర్చారు. ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించేవారాయన. "గాలితో నైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం"అన్నారు అయ్యదేవర కాళేశ్వరరావుగారు.

1929లో సైమన్ కమీషన్ మద్రాసుకు వచ్చింది. మద్రాసులో అతనిని బహిష్కరించటం వద్దన్నాడు గాంధీజీ. గాంధీగారి ఆదేశం ప్రకాశంగారికి నచ్చలేదు. రాజాజీ చల్లగా తప్పుకున్నాడు. ప్రకాశంపంతులు, దుర్గాబాయ్, రంగయ్యనాయుడు గార్లు, వేలాది ప్రజలతో వూరేగింపువెళ్తూ 'సైమన్ గోబ్యాక్' అని గర్జించారు. బ్రిటీష్ తొత్తులైన సైనికులు తుపాకులతో కాలుస్తాం అని కేకలు వేశారు. ఒక అజ్ఞాత దేశభక్తుడు తుపాకి గుళ్లకు బలిఅయ్యాడను వార్త దావానలంలా వ్యాపించింది. ప్రకాశం సింహంలా ముందుకురికాడు. చొక్కా గుండీలు విప్పి"రండిరా యిదె కాల్చుకొండిరా"అని గుండెలిచ్చి గండడైనిల్చాడు. తుపాకులు తలలువంచాయి. అంతటితో ప్రకాశం పేరు దేశమంతటా మార్మోగింది. 'ప్రమాదములున్న చోటనే ప్రకాశంగారుంటారు'అన్న పట్టాభిగారి మాటలు సత్యపూర్ణమైనవి.

ప్రకాశంగారు సత్యాగ్రహోద్యమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. పలుమార్లు జైలుకు వెళ్లారు. గాంధీజీని సైతం లెక్కచేయని ఆంధ్రనాయకులలో మొదటివారు ప్రకాశం. రెండవవారు గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు.

1937లో ఎన్నికలొచ్చాయి. సర్దార్ పటేల్ గారి ఒత్తిడిపై మద్రాసునుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన ప్రకాశంగారు ఎన్నుకోబడ్డారు. రాజాజీ మంత్రిగా చేసిన ఘనకార్యాలు ముఖ్యంగా:

రాయలసీమ కరువు కాలంలో స్వయంగా పర్యటించి కరువు పనులు ముమ్మరంగా ప్రారంభింపజేశారు.

పంటలు పాడైనప్పుడు ధారాళంగా శిస్తు రెమిషన్ యిప్పించారు.

శిస్తుభారంతో బాధపడ్తున్న రైతులకు 75లక్షల శిస్తు ముజరా యిప్పించారు. రెండవ ప్రపంచ యుద్ధం రావటంతో కాంగ్రెస్ మంత్రివర్గం రాజీనామా చేసింది.

'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలులో వుంచారు.

1945లో జైలు నుండి విడుదలైన తర్వాత రాష్ట్రమంతటా పర్యటించారు. ప్రజలాయనను ఎంతగానో ప్రేమించారు. మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ప్రకాశంగారు ఫిర్కా డెవలప్ మెంట్ స్కీమ్ ఉత్పత్తిదారుల వినియోగదారుల సహకార సంఘాలు నెలకొల్పారు. గాంధీజీ, రాజాజీ వంటి నాయకులు ప్రకాశంగారికి వ్యతిరేకంగా కుట్రచేశారు. ప్రకాశం ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెసును వదలి ప్రజాపార్టి స్థాపించారు.

పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్రరాష్ట్రం