పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెల్లదొరలను గజ గడలాడించిన రేనాటి వీరుడు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

"అదుగో వచ్చే, ఇడుగో వచ్చే నరసింహారెడ్డి
పళపళ పళపళ కేకవేసెరా నరసింహారెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహారెడ్డి
..............................
ఆవుల మందలో పులి దుమికిన చందము దుమికినడూ
.......................................
కరువు వచ్చినా కొలమొచ్చినా ఆదరించే రెడ్డీ
అట్టివక్క మన రెడ్డిమాటనూ చిన్న చెయ్యరాదూ
నాలుగు గ్రామాల మందిగా తాము లేచినారు."

1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్యయుద్ధానికి పదేళ్ళముందే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటుజెండా రెపరెపలాడించిన స్వాతంత్ర్య వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.

విజయనగర రాజులు తళ్ళికోట యుద్ధంలో బహమని సుల్తానుల చేతిలో ఓడిపోయారు. సామంతులుగా వుండిన పాలెగాళ్ళు తమ కత్తికి అడ్డం లేకుండా నియంతల వలె వ్యవహరింపసాగారు. రాజులమని గొప్పగా విర్రవీగేవారు.

1799లో టిప్పుసుల్తాన్ ఆంగ్లేయుల చేతుల్లో ఓడిపోయాడు. అప్పుడు రాయలసీమ నైజాం వశంలో ఉండేది. నైజాం నవాబు రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించాడు. పాలెగాళ్ళు బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చారు. కడపజిల్లాలో ఆనాడు 80మంది పాలెగాళ్ళుండేవారు. వీరు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారు. దత్తమండలానికి మొట్టమొదటి కలెక్టర్ సర్ ధామస్ మన్రో. పాలెగాళ్ళ పారంపర్య హక్కులను రద్దుచేసాడు. వారికి నెలసరి ఫించన్ ఏర్పాటు చేశాడు.

ఈనాటి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ పాళెగాడు పెద్దమల్లారెడ్డి. అతని ముగ్గురు కొడుకుల్లో చివరివాడు నరసింహారెడ్డి. కోయిలకుంట్ల తాలూకా లోని ఉయ్యాలవాడ జాగీర్‌ను ఆంగ్లేయులు వశం చేసుకునే నాటికి ఆ జాగీర్ నుండి 30 వేల రూపాయలకు పైగా రెవిన్యూ రాబడి వుండేది. జాగీర్‌ను వశం చేసుకున్న తెల్లదొరలు పెద్దమల్లారెడ్డి కుటుంబానికి రు. 70 ఫించన్ ఏర్పాటు చేశారు. అందులో పెద్దమల్లారెడ్డి తమ్ముడు చిన మల్లారెడ్డికి సగంపోగా మిగతా సగం 35 రూపాయల్లో నరసింహారెడ్డికి మూడోవంతుదా 11 రూపాయలు 10 అణాలు 8 పైసలు ఫించన్ వచ్చేది. నరసింహారెడ్డి మాతామహుడైన (తల్లి తండ్రి) నొస్సం జమీందార్ జయరామరెడ్డికి ఏటా 22 వేల రూపాయల రెవిన్యూ వచ్చే జాగీర్‌ను వశం చేసుకుని