పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతా స్త్రీలే. దేవదాసీలు, పరదాలు వేసుకున్న ముస్లిం మహిళలు!

గాంధీజీ ఉపన్యాసం ప్రారంభిస్తూ "నా ఉపన్యాసాన్ని దుర్గ తెలుగులో అనువదిస్తుంది. మీరు కూర్చోండి" అన్నారు కొండా వెంకటప్పయ్యగారిని.

అయిదు నిమిషాలంటూ ప్రారంభించించిన గాంధీజీ గంటసేపు మాట్లాడారు. బీదల కోసం డబ్బులివ్వండి అన్నారు. మహిళలు తమ గాజులు, ఒంటి మీద ఆభరణాలు తీసి ఇచ్చారు. దుర్గాబాయి అయిదువేల నిధి సమర్పించింది. సభ లోని మహిళలిచ్చిన ఆ నగలు, నగదు పాతిక వేలు మించింది!

గాంధీజీ దుర్గాబాయిని తన కారులో కూర్చోమన్నారు. ఆ బాల దుర్గాబాయిని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆంధ్ర పర్యటన అంతా దుర్గాబాయి, అనువాదకురాలుగా సాగింది.

మద్రాసులో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో ఆమె నాయకురాలు. రెండేళ్ళ జైలుశిక్ష తర్వాత విడుదలయిందామె.

పట్టుదలకు ప్రతీక దుర్గాబాయి. ప్రైవేటుగా, బెనారస్ యూనివర్సిటీ నుండి మెట్రిక్యులేషన్ పాసై, అక్కడే ఇంటర్మీడియేట్ పాసైయ్యారు. అక్కడే బి.ఏ. (ఆనర్స్) చదవాలనుకున్నారు. వీలుకాలేదు. వాల్తేరు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో చేరాలని, వైస్ ఛాన్సలర్ డా. సి.ఆర్.రెడ్డిగారిని కలుసుకున్నారు. మహిళలకు ప్రత్యేకంగా హాస్టల్ లేనందున, వీలుకాదన్నారు. పది మంది మహిళల అప్లికేషన్లు అందించి, మరలా అభ్యర్ధించంగా డా. రెడ్డిగారు అనుమతించారు. దుర్గాబాయి బి.ఏ. (ఆనర్స్) లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మద్రాసు లా కాలేజిలో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు. సివిల్ మరియు క్రిమినల్ కేసులను చేబట్టి, బాగా పేరు సంపాదించారామె.

మద్రాసులో ప్రాక్టీసు చేస్తూ, ఆమె ఆంధ్ర మహిళా సభ భవన నిర్మాణానికి పూనుకున్నారు. కస్తూరిబా నిధికి వేలాది రూపాయలు వసూలు చేసి గాంధీజీకి ఇచ్చారు.

ఆమె ప్రతిభా సామర్ధ్యాలను గుర్తించిన నాయకులు ఆమెను రాజ్యాంగ సభ సభ్యురాలుగా ఎన్నుకున్నారు. డాక్టర్ అంబేద్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బి.ఎన్.రావు వంటి ఉద్ధండులతో కలసి ప్రాథమిక హక్కులు, స్త్రీలకు ఆస్తిహకు మున్నగు అంశాలను రాజ్యాంగంలో చేర్పించారు.

1950 తర్వాత ఆమె సాంఘిక సేవారంగంలో ప్రవేశించారు. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూగారు పాతిక వేల రూపాయల చెక్కు ఇచ్చి రాయలసీమ క్షామ నివారణ పథకాల పర్యవేక్షణకు పంపారు.

1952లో దుర్గాబాయిగారిని ప్లానింగ్ కమిషన్ మెంబరుగా ప్రభుత్వం నియమించింది. 1953 సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ గా వుంటూ పదేళ్ళు పని చేశారు. ఆ సమయంలోనే మహామేధావి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి డాక్టర్ చింతామణి దేశ్‌ముఖ్ గారిని పెళ్ళాడారు. అతి నిరాడంబరంగా జరిగిన పెళ్ళికి పెద్దలు