పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


శ్రీరావు ఆంధ్ర పత్రిక సంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. తాడిపత్రిలో "మాతృసేవ" పత్రిక స్థాపనకు సంకటి కొండారెడ్డిగారిని ప్రోత్సహించారు. కైవ సుబ్రహ్మణ్య శర్మ (నంద్యాల) గారితో పాటు "కౌమోదకి" పత్రిక స్థాపించారు. ఆయర్వేద వైద్య ప్రచారం చేశారు.

బీద కుటుంబంలో పుట్టిన రావుగారు ఏనాడూ, ఏ పదవికీ ప్రాకులాడలేదు. 'హిందూ' పత్రికకు సమీక్షలెన్నో వ్రాశారు. ఆ విధంగా తమకు కావలసిన పైకాన్ని సమ కూర్చుకునేవారు. ఎవరినీ యాచించని ఆత్మ ధనులాయన.

గాంధీజీ ప్రశంస

తాము నమ్మిన సిద్ధాంతాల పట్ల అచంచల విశ్వాసం గలవారు, గాంధీజీనే విమర్శించి నపుడు, 'ద బ్రేవ్ హరిసర్వోత్తమరావు' అన్నారు గాంధీజి.

వృద్దాప్యం పైబడినా, తమ పనులను తామే చేసుకొనేవారు. అనంతపురంలోని వయోజన విద్యాకేంద్రాన్ని దర్శించేందుకు వచ్చినప్పుడు (1956లో) వారు వేకువనే లేచి వాహ్యాళి వెళ్లారు. అదివరకే వారితో నాకున్న పరిచయంతో, వారి పడకను దులిపి చుట్టి పెట్టాను. వచ్చిన వెంటనే నన్ను పిలిచి "నా పడక ఎందుకు చుట్టావ్. నా పని నేనే చేసుకోవాలి. నన్ను త్వరగా చావమంటారా?"అన్నారు. క్షమించమన్నాను.

నిరంతర శ్రమవల్ల వారి ఆరోగ్యం దెబ్బతినింది. మద్రాస్‍లోని గోపాలపురంలో వున్న కూతురు, శ్రీమతి ద్వారకాబాయి, అల్లుడు పార్ధసారథి గార్లతో వుండిపోయారు. రావు గారి వైద్య సేవల కోసం చివరి దశలో శ్రీగోవింద వల్లభపంత్ 2 వేల రూపాయలు పంపారు. అంతే వారందుకున్న ప్రతిఫలం.

గాడిచర్ల వారి సేవలకు చిహ్నంగా విజయవాడలో (పటమట) సర్వోత్తమ భవనం నిర్మింపబడినది. కీ||శే|| పాతూరి నాగభూషణం గారు ఈ స్మారక భవన నిర్మాణాని కెంతో కృషి చేశారు.

త్యాగం, సేవ, దీక్ష మున్నగు గుణాలకు మూర్తిగా వెలిగిన 'ఆంధ్ర తిలక్' శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1960 ఫిభ్రవరి 29న మద్రాస్‍లో కన్ను మూశారు.

"నిజానికి ఆనాడు ఆంధ్రలో హరిసర్వోత్తమరావు జన్మించి వుండని యెడల రాజకీయోద్యమానికి పునాదియేలేకపోయివుండేది. ఆంధ్రలో రాజకీయాలకు ఆదిపురుషుడు శ్రీ హరిసర్వోత్తమరావు" అన్న యర్ర మిల్లి జగ్గన్న శాస్త్రి గారి పలుకులు అక్షరాలా నిజమైనవి.