Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పార్టీలో చేరారు రావుగారు. 1924 జనవరి 1, 2తేదీలలో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో, స్వయం సేవకుల సంస్థ "హిందూస్థానీ సేవాదళ్" స్థాపనలో శ్రీరావు ప్రముఖ పాత్ర వహించారు.

1927లో రావుగారు, ఆంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధిగా నంద్యాల నియోజకవర్గం నుండి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‍కు జరిగిన ఎన్నికలో జస్టిస్ పార్టీ అభ్యర్థిని ఓడించి ఎన్నుకోబడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా పనిచేశారు.

కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ప్రారంభించిన విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి కార్యదర్శిగా, ఆ సంస్థ నుండి వెలువడిన మొదటి గ్రంథం, 'అబ్రహాం లింకన్' జీవిత చరిత్ర వ్రాశారు. గ్రీస్ దేశ చరిత్ర, విస్మత కవిసార్వభౌముడు మున్నగు గ్రంథాల నెన్నింటినో వ్రాశారు. 'శ్రీ రామ చరిత్ర'కు వ్యాఖ్య వ్రాశారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటూ వందలాది వ్యాసాలు రచించారు. విద్యార్ది దశలోనే రాజమండ్రిలో 100 మందితో వయోజన విద్యాకేంద్రం నడిపారు. రైతు సంక్షేమానికి పాటు పడ్డారు. పంచాయితీ మహాసభ, సహకార సభ, హిందీ మహాసభ, ఉపాధ్యాయ మహాసభ వంటి ఎన్నో సభలకు అధ్యక్షత వహించారు. మద్రాసులో పాకీ పని వార్ల సంఘానికీ, ప్రెస్ వర్కర్ల సంఘానికి అధ్యక్షులుగా వుండేవారు. 1930 లో రాజకీయ రంగం నుండి క్రమముగా వైదొలగి, గ్రంధాలయోద్యమం, వయోజనవిద్యా రంగాల్లో జీవితమంతా గడిపారు. 1934 నుండి జీవితాంతం దాక ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ అధ్యక్షులుగా ఉండేవారు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా బోధకులకు ఉపయుక్తమగు రచనలెన్నో చేశారు. ఎన్నో శిక్షణా శిబిరాలను నిర్వహించారు. భారత వయోజన విద్యాసంఘంలోను, అంతర్జాతీయ వయోజన విద్యా మహాసభలోను ప్రముఖ పాత్ర వహించారు.

ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అవిశ్రాంతంగా కృషి చేసి, ఆంధ్ర ప్రజలందరినీ సమైక్య పరచి ఆంధ్రప్రదేశ్ అవతరణను చూచారు.

1950లో మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం రావుగారిని, ఆంధ్ర ప్రాంత వయోజన విద్యా గౌరవ డైరెక్టర్‍గా నియమించింది. 1952లో గాడిచర్లవారు బళ్ళారి జిల్లాలోని (అవిభక్త మద్రాసు రాష్ట్రం) కన్నడ తాలూకాలలో పర్యటించినప్పుడు, వారి తెలుగు ప్రసంగాలను కన్నడం చేసే అదృష్టం నాకు కల్గింది. పగటి పూట గ్రామ పంచాయితీలను, గ్రంథాలయాలను దర్శించేవారు. రాత్రివేళల్లో వయోజన విద్యా కేంద్రాలను దర్శించేవారు. వారి అవిశ్రాంత కృషి ఆదర్శ వంతం.

కళలకు ప్రోత్సాహం

సామాన్య ప్రజలలో కళల పట్ల, సాహిత్యం పట్ల అభిరుచి పెంచేందుకు నాటకోత్సవాలను జరిపారు. కృష్ణదేవరాయ జయంత్యుత్సవాలను జరిపారు. 1928లో నంద్యాలలో శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో, దత్తమండలాన్ని 'రాయలసీమ' గా నామకరణం చేసినవారు శ్రీ గాడిచర్ల వారే!