పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
దస్త్రం:SuprasiddulaJeevithaVisheshalu Page 9 Image 1.png

బ్రౌన్‌కు ఆనాటి పండితులు, యితరులు వ్రాసిన జాబుల సంపుటాలు 20కి పైగా వున్నాయి. ఇవన్నీ మద్రాసు ఓరియంటల్ మేనుస్క్రిప్టు లైబ్రరీలో వున్నాయి. వీటిలో విలువైన చారిత్రక విషయాలున్నాయి.

ప్రతి పైసాను కూడబెట్టి తన కింద పనిచేసే పండితులకు నెలనెలా జీతాలిచ్చేవాడు. ఆర్థికంగా కటకటలాడుతున్నా పుస్తకాల సేకరణ, ప్రచురణ పథకాలను నెలనెలా వందలు ఖర్చు చేసేవాడు. చివరికి 60వేల రూపాయలు అప్పులు చేశాడు. ఇందులో సగం వడ్డీ- ఇదంతా తెలుగు భాషోద్ధరణ కోసమే. చివరి దశలో అప్పులన్నీ తీర్చాడు.

బ్రౌన్ మానవతావాది. ప్రతి నెలా 100 - 130 మంది గుడ్డి, కుంటి వారికి సాయం చేసేవాడు. అప్పులు చేసి జైలుపాలైన పదకొండు మందికి 355 రూపాయలిచ్చి విడిపించాడు. ఒక దశలో నెలకు సగటున 500 రూపాయలు దానధర్మాలకు ఖర్చు చేసేవాడు. కడపలో జరగనున్న సహగమనాన్ని ఆపు చేయించాడు.

ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపచేసిన బ్రౌన్ దొర సేవను ప్రశంసిస్తూ, నాటి పండితుడు అద్వైత బ్రహ్మశాస్త్రి యిలా అన్నాడు.

"సరస్వతికి ప్రస్తుతమందు తమరు ఒకరే నివాసస్థానముగా కనబడుతున్నారు. ఎక్కడ ఏ ఏ విద్యలు దాచబడి వున్నవో అవి అన్నీ తమంతట తామే తమ సన్నిధికి వస్తూ వున్నవి ... తమరు పుచ్చుకున్న ప్రయాసల వల్ల తేలిన పరిష్కారగ్రంథములు అకల్పాంతమున్ను తమ యొక్క కీర్తిని విస్తరిస్తూ వుంటవి."

ఆంధ్ర భాషోద్ధరణ కోసం జీవితం అంకితం చేసిన బ్రౌన్ స్మృతి చిహ్నంగా కడపలో ఆయన నివసించి సాహిత్య యజ్ఞం చేసిన స్థలంలో గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తి అయింది. బ్రౌన్ బంగళా శిథిలాలున్న స్థలాన్ని శ్రీ సి. కె. సంపత్ కుమార్ సి.పి. బ్రౌన్ మెమోరియల్ ట్రస్టుకు ఉచితంగా యిచ్చారు. ప్రజా