పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1825లో రాజమండ్రికి బదిలీ అయి ఆంధ్ర మహాభారతం చదవసాగాడు. అప్పకవీయం, కవిజనాశ్రయం మున్నగు వాటిని జీర్ణించుకున్నాడు. తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం ముమ్మరంగా సాగించాడు. అగ్గి పురుగులకు ఆహుతి కానున్న తెలుగు కావ్యాల వ్రాత ప్రతులను సేకరించాడు. కొంత డబ్బుతో పండితులను, వ్రాయసగాళ్ళను పెట్టి కావ్య పరిష్కరణ, శుద్ధప్రతులు తయారు చేయించాడు. ఆంధ్ర మహాభారతాన్ని, భాగవతాన్ని పరిష్కరింప చేసి అచ్చు వేయించినవాడు బ్రౌన్. 'నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్' అన్నాడు పరిశోధక సాహసి బంగోరె.

తెలుగుదేశాన్ని ముఖ్యంగా రాయలసీమను కృంగదీసిన కరువులెన్నో వచ్చాయి. వాటిలో ధాత కరువు (1876-77) అంతకు ముందు వచ్చిన నందన కరువు (1832-33) మహాఘోరమైనవి. నందన కరువునే ’గుంటూరు కరువు’గా చరిత్రకారులు చిత్రించారు. కరువు పరిస్థితులను గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన జాబులోని పదజాలం ప్రభుత్వానికి నచ్చలేదు. కరువు (ఫ్యామిన్) అన్న పదానికి బదులుగా 'కొరత' అని వ్రాయమన్నారు. బ్రౌన్‍ను ప్రభుత్వం మందలించింది. కరువు కాలంలో గుంటూరు జిల్లాలో ఎన్నో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయించి ప్రజలను ఆదుకొన్నాడు.

1835-38 మధ్య సెలవు పై లండన్ వెళ్ళాడు. అక్కడ కూడా విశ్రాంతి లేకుండా తెలుగు భాష కొరకు శ్రమించాడు. 'ఇండియ హౌస్ లైబ్రరి'లో గుట్టలుగా పడివుండిన దక్షిణ భారత భాషల గ్రంథాలు (లిఖిత ప్రతులు) 2106ను మద్రాసు గ్రంథాలయానికి పంపాడు. తిరిగి వచ్చిన తరువాత వసుచరిత్ర- మనుచరిత్రలకు వ్యాఖ్యలు వ్రాయించాడు. కళాపూర్ణోదయం, పల్నాటి వీర చరిత్ర మున్నగు 25 ప్రబంధాలను పరిష్కరింపజేశాడు. సంస్కృత గ్రంథాల సేకరణ, పరిష్కరణ చేశాడు.

దాదాపు 2వేల వేమన పద్యాలను సేకరించి వాటిలో 693 పద్యాలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి అచ్చు వేయించాడు. అలా వేమన పద్యాలకు ప్రపంచంలో విసృత ప్రచారం కావించాడు.

ఇదంతా పండిత భాషకు సంబంధించిన కృషి. ప్రజా భాషకు మరింత ఎక్కువ కృషి చేశాడు. ప్రజల నోళ్ళలో నానుతూ వచ్చిన చాటువులను, సామెతలను, కథలు, గాథలు, పలుకుబడులను సేకరించాడు. తెలుగు నేర్చుకోదలచిన ఆంగ్లేయుల కోసం ఎన్నో వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు వ్రాశాడు. అన్నిటి కన్నా మిన్నగా చెప్పవలసిన పని, నిఘంటువు నిర్మాణం. తెనుగు-ఇంగ్లీషు, ఇంగ్లీష్ తెనుగు నిఘంటువులు వ్రాశాడు. ఈనాటికీ అవి ప్రామాణికంగా వున్నాయి. జిల్లా నిఘంటువు వ్రాశాడు. తెలుగు సాహిత్యం గురించి శిల్పము, జ్యోతిష్యము, కలిశకం, హిజరి, మున్నగు వాటిపై పెక్కు వ్యాసాలు వ్రాశాడు. రాజుల యుద్ధము అను అనంతపురం చరిత్ర తాతాచారి కథలు, పంచతంత్ర కథలు యిలా ఎన్నో రచనలు చేశాడు.