పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. తెలుగు నేర్పే పండితులకు ఇంగ్లీషు బొత్తిగా తెలియని రోజులవి.

1820లో సర్ థామస్ మన్రో మద్రాసు గవర్నరుగా చేరాడు. కంపెనీ ఉద్యోగులందరూ దేశ భాషలలో ప్రావీణ్యం సంపాదించాలనీ, ప్రజల భాషలోనే ప్రభుత్వ వ్యవహారాలను సాగించాలని ఆదేశించాడు. మన్రో తన 'కాన్వొకేషన్' ఉపన్యాసంలో చేసిన ప్రబోధం బ్రౌన్ మనసులో మంత్రోపదేశంగా నాటుకొన్నది.

1820 ఆగస్టులో బ్రౌన్ కడపలో ఉద్యోగజీవితం ప్రారంభించాడు. కడప కలెక్టరుకు అసిస్టెంటుగా వుండేవాడు. అప్పటి కలెక్టరు హన్‌బరి తెలుగులో అనర్గళంగా మాట్లాడేవాడు. అయనలాగా మాట్లాడాలని నిశ్చయించుకున్నాడు బ్రౌన్.

1820-22 చివరి వరకు కడపలో పనిచేశాడు. కొంతకాలం మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునల్వేలి మున్నగు చోట్ల పనిచేశాడు. 1826-29 మధ్య కడపలో మరోసారి ఉద్యోగం చేశాడు.

తెలుగు సాహిత్యానికి సుక్షేత్రమైన కడపలో ప్రధాన కార్యస్థానాన్ని నెలకొల్పాడు. ఆయన పలు చోట్ల పని చేసినా ఎక్కడా స్థిరాస్తి సంపాదించలేదు. కడపలో పెద్ద బంగళా, తోట కొన్నాడు. అప్పట్లో అతని వేతనం 5-6 వందలకు మించదు. బంగాళాలో పెద్ద గ్రంథాలయం నెలకొల్పాడు. సొంత డబ్బుతో పండితులను నియమించాడు. బంగళాను 'సాహిత్య కర్మాగారం'గా రూపొందించాడు.

అవిద్య అకాండతాండవం చేస్తున్న కాలమది. చదువుకొన్న తెలుగు యువకులు చాలా అరుదుగా వున్న కాలమది. 1821లో కడపలో రెండు బళ్ళు పెట్టాడు. ఉచితంగా తెలుగు, హిందూస్తానీలలో చదువు చెప్పించాడు. ఆ బళ్ళలో దేశీయ ఉపాధ్యాయులను నియమించాడు. విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించాడు.

కడపలోని బంగళా, తోట వ్యవహారాలన్నింటినీ బ్రౌన్‌కు అత్యంత విశ్వాస పాత్రుడైన అయోధ్యాపురం కృష్ణారెడ్డి చూచుకొనేవాడు. బ్రౌన్ ఎక్కడ పనిచేస్తున్నా కడపలోని బంగళా, తోట, గ్రంథ పరిష్కరణ, గ్రంథ సేకరణ మున్నగు విషయాలను అయోధ్యపురం కృష్ణారెడ్డి ద్వారా జాబుల మూలంగా తెలుసుకొనేవాడు.

మచిలీపట్నంలో కూడా రెండు పాఠశాలలను ప్రారంభించాడు. అక్కడ కూడా ఉచిత భోజన వసతి కల్పించాడు.

1824లో అబేదుబాయ్ వ్రాసిన"హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్"పుస్తకం చదువుతుండగా వేమన ప్రస్తావన కన్పించింది. వేమన పట్ల శ్రద్ధ పెరిగింది. వేమన పద్యాలు గల తాటాకు ప్రతులెన్నో తెప్పించాడు. మచిలీపట్నం కోర్టు పండితుడు తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి, వఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి ఆ దశలో సాహిత్య విద్యా గురువులయ్యారు. వేమన పద్యాలకు అర్థతాత్పర్యాలు బోధించారు. తెలుగు వ్యాకరణ, ఛందస్సూత్రాలు నేర్చుకొన్నాడు బ్రౌన్.