పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బావులవలె కొందరు ఆంగ్లేయులు భారతీయ సంస్కృతిని నాగరికతను అర్థం చేసుకొని మనకు మహోపకారం చేశారు. వారిలో తెలుగు ప్రజలకు సంబంధించినంతవరకు చిరస్మరణీయులు నలుగురు.

ఆనాడు దత్తమండలాలుగా పేరుగాంచిన రాయలసీమ జిల్లాల మొదటి కలెక్టరుగా, యీ ప్రాంతంలో శాంతిభద్రతలను నెలకొల్పి, పాళెగాళ్ల అరాచకాలను అణచివేసి, 'మండ్రోలయ్య' గా ప్రజల మన్ననలందుకున్న వాడు సర్ థామస్ మన్రో.

మన దేశ చరిత్రకు కావలసిన ముడి సరుకును కైఫియత్తుల రూపంలో అందించిన మహనీయుడు కల్నల్ కాలిన్స్ మెకెంజీ.

అపారమైన గోదావరీ జలాలకు అడ్డంగా ఆనకట్ట నిర్మింపజేసి తెలుగు ప్రజలకు అన్నదాతగా విఖ్యాతుడైనవాడు సర్ ఆర్థర్ కాటన్.

మినుకు మినుకు మంటున్న తెలుగు వాజ్మయదీపాన్ని స్నేహసిక్తం చేసి ప్రజ్వలింప చేసిన ఆంధ్ర భాషోద్ధారకుడు సి.పి. బ్రౌన్.

ఈ నలుగురు కారుమేఘాల్లో మెరుపుల్లాంటి మహనీయులు.

ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తండ్రి రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకుడిగా 1786 లో కలకత్తా వచ్చాడు. హిందూ మతాచారాలను అవగతం చేసుకొనే లక్ష్యంతో భారతీయ భాషలను నేర్చుకున్నాడు. ప్రాచ్య భాషా సంస్కృతులపట్ల ఆదరాభిమానాలు కలవాడు డేవిడ్ బ్రౌన్.

డేవిడ్ బ్రౌన్, కౌలే దంపతుల రెండవ కుమారుడిగా సి.పి.బ్రౌన్ 1798 నవంబరు 10వ తేదీన కలకత్తాలో జన్మించాడు. తండ్రి మరణం తర్వాత బ్రౌన్ కుటుంబం ఇంగ్లాండుకు వెళ్ళిపోయింది. ఇండియాలో, ఈస్టిండియా కంపెనీ ఉద్యోగానికి మొదటి మెట్టుగా బ్రౌన్ ను లండన్ (హెర్ట్‌ఫర్డ్) లోని హెయిల్ బరీ కాలేజీలో చేర్పించారు. ఈ కాలేజీలో సంస్కృతం బోధించేవారు. సంస్కృతం లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు 'బంగారు పతకాలు' యిచ్చేవారు. ఆ పతకం అంచు చుట్టూ "తత్ సుఖ సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం" అన్న సంస్కృత సూక్తి ఒకవైపు, మరోవైపు 'శ్రీవిద్యా వరాహ' అని చెక్కబడి వుండేది. ఆవిధంగా బ్రౌన్ సంస్కృతాభ్యాసం సాగించి బంగారు పతకం పొందాడు.

కంపెనీ ప్రభుత్వం బ్రౌన్ సోదరులిద్దరినీ ఎన్నుకొని బెంగాల్ సర్వీసుకు, మద్రాసు సర్వీసుకు ఎంపిక చేసింది. తెలుగు వారి అదృష్టం కొద్దీ సి.పి. బ్రౌన్ మద్రాసుకు కేటాయింపబడ్డాడు.

1817లో ఆగస్టు 4వ తేదీన బ్రౌన్ మద్రాసులో కాలుపెట్టాడు. అప్పటికి ప్రపంచంలో తెలుగు భాష ఒకటి వుంది, అనేది కూడా అతనికి తెలియదు. అప్పటికతని వయసు పందొమ్మిదేళ్ళు. ఫోర్ట్‌సెంట్ జార్జి కాలేజీలో శిక్షణ కోసం చేరాడు. వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకొన్నాడు. పదహారు నెలల్లో