పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ యాలోచనకు వారిద్దఱును సంతోషముతో నంగీకరించినందున బహుమానుఁడే ప్రయాణమునకు గావలసిన సర్వ సామగ్రిని సిద్ధముచేసి యావృద్ధగోపకునిగూడఁ దమతో వచ్చుట కొడఁబఱిచెను. ఆ గోపవృద్ధు ప్రమతియొక్క మిగిలియున్న యాభరణములను, ఆమెచిన్ననాటి బట్టలను, ఆ బట్టల కంటించియున్న కాగితమునుగూడ దనతో గొనిపోయెను. కొన్నాళ్లు సముద్రముమీద సుఖయాత్ర చేసినతరువాత, వారందఱును క్షేమముగా సుమిత్రుని రాజధానికివచ్చి చేరిరి. పోయిన భార్యను కొమార్తెను దలఁచుకొని మనోవ్యాధితో బరితపించు చున్న సుమిత్రుడు బహుమానుని నత్యంతప్రేమతోఁ నాదరించి, పరమప్రమోదముతో రామవర్మకును అతిధిసత్కారము నెఱపి గారవించెను. బహుమానుడు తీసికొనిపోయి రామవర్మ యొక్క కాబోవురాణియని కనబఱచిన ప్రమతిమీదనే రాజు దృష్టియంతయు నుండెను. ఆమెయందు దన పోయిన భార్యయొక్కపోలిక కనబడినందున, ఆయన కప్పుడు క్రొత్తగా దు:ఖము లోపలినుండి బయలు దేఱి "నేనట్లు కఠినచిత్తుడనై చంపింపకుంటినేని, నాకూతురు నిటువంటి చక్కనికన్నియయే యగునుజుండీ" యని కంట దడిపెట్టెను. ఆ వెనుక రాజు రామవర్మవంక దిరిగి "ఉత్తముడైన నీతండ్రియొక్క చెలిమిని నిష్కారణముగా బోగొట్టుకొంటిని; ప్రాణాధికుడైన యాతని నేలాగుననైన నొకసారి చూడవలెనని నాకెంతో యభిలాష